జగన్ మారిపోయారు అంటున్నారు సినీ నటుడు రాజశేఖర్. ఆయన మారిపోయారా అంటే అదే పట్టుదల, అదే టార్గెట్. అవి అసలు మారలేదు,  కానీ ఆయన పొలిటికల్ గా కొన్ని సార్లు చేసిన తప్పులు, తప్పటడుగులు ఇవి మాత్రం ఆయన సరి చేసుకుంటున్నారు. అదే 2014 నాటికి, ఇప్పటికీ వచ్చిన తేడా.


జగన్ అంటే ఒక్కసారి ఎవరితో విభేదించినా మళ్ళీ చేరదీయడు అన్న పేరు ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ అలాంటిది ఎక్కడా చేయలేదు. ఆయన అందరినీ ఆదరిస్తూ పోతున్నారు. ఉదాహరణలు ఎన్నో ఈ మధ్యనే కనిపించాయి. జగన్ని అప్పట్లో తిట్టిన వారే తాము మళ్ళీ పార్టీలో చేరుతామని వస్తే చేర్చుకున్నారు. ఫిరాయించిన వారిని సైతం ఆదరించారు. అలా కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మణి గాంధి వంటి వారు ఉన్నారు. ఇక జగన్ తో ఉంటూ ఒక్కసారిగా ప్లేట్ మార్చి గత ఎన్నికల్లో పార్టీ నుంచి వెళ్ళిపోయిన రఘురామ క్రిష్ణం రాజు వంటి వారిని కూడా జగన్ అక్కున చేర్చుకున్నారు.


ఇక సినీ నటులతో జగన్ కి ఎపుడూ విభేదాలు లేవు కానీ పార్టీ పెట్టిన కొత్తల్లో వచ్చి చేరిన వారు జీవిత, రాజశేఖర్. అప్పట్లో జగన్ అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. కొన్నింటికి వారితో పాటు జీవితా రాజశేఖర్ కూడా హాజరయ్యారు. అటువంటిది వారికి ఎక్కడ తేడా వచ్చిందో కానీ జగన్ నుంచి దూరం జరిగారు. ఆ మీదట జగన్ అహంకారి అంటూ ఈ సినీ జంట హాట్ కామెంట్స్ చేశారు. అనేక ఇంటర్వ్యూలలో కూడా అదే చెప్పారు. కానీ ఈ రోజు వారు పార్టీలోకి వచ్చి చేరారు. 


ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ జగన్ తో మిస్ అండర్ స్టాండింగ్  వచ్చి అప్పట్లో దూరమయ్యామని, ఆయన లవ్ బుల్ పర్సన్ అంటూ కితాబు ఇచ్చారు. జీవిత కూడా జగన్ కష్టపడుతున్నారు. ఆయనకు ఒక్క సారి అవకాశం ఇవ్వాలని కోరారు. బాబును మూడు సార్లు ముఖ్యమంత్రిని చేసిన ఏపీ ప్రజలు జగన్ కు చాన్స్ ఇస్తే తప్పేంటని కూడా ప్రశ్నించారు. మొత్తానికి జగన్ అటు, ఈ దంపతులు ఇటు పాత విషయాలు మరచిపోయి ఒక్కటి కావడం విశేషమే.


మరింత సమాచారం తెలుసుకోండి: