పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తొలిసారి పోటీ చేస్తున్నారు. ఒకటికాదు రెండుచోట్ల ఆయన పోటీకి రెడీ అయిపోయారు. విశాఖ అర్బన్ జిల్లా గాజువాకతో పాటు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక నామినేషన్ వేసిన తరువాత పదిరోజులకు గాజువాక వచ్చిన పవన్ పెద్ద రోడ్ షో ఒకటి నిర్వహించారు. తాను పక్కాలోకల్ అని చాటుకున్నారు. అందుకోసం ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ పవన్ ఈ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటారని ఇపుడు ప్రత్యర్ధులతో పాటు జనం నుంచి వస్తున్న ప్రశ్న.


పవన్ దీనికి సమాధానం కూడా ఇచ్చేశారు. వారానికి రెండురోజులు గాజువాకలో ఉంటానని పవన్ గాజువాకకు ఓ వరం ప్రకటించారు. ఐతే అది సరిపోతుందా అన్నదే ఇపుడు అంతా సంధిస్తున్న ప్రశ్న. దీనిమీద టీడీపీ అభ్యర్ధి పల్లా శ్రీనివాస్ అయితే హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వారానికి రెండురోజులు ఉండే ఎమ్మెల్యే కావాలా, 24x7 అందుబాటులో ఉండే ఎమ్మెల్యే కావాలో తేల్చుకోండంటూ అపుడే ప్రచారం మొదలెట్టేశారు.


పవన్ రెండు రోజులు ఉంటే సమస్యలు తీరిపోతాయా, మిగిలిన అయిదు రోజులు ఆయన తరఫున పార్టీ వారు ఉండి పరోక్ష పాలన సాగిస్తారా అంటూ తూర్పారా పట్టేశారు. తాను పక్కాలోకల్ అని అర్ధరాత్రి పిలిచినా వచ్చి వాలుతానని కూడా అంటున్నారు. ఇదే విషయమై వైసీపీతో పాటు ఇతర పార్టీలు కూడా కామెంట్శ్ చేస్తున్నాయి. ఇక పవన్ ఇక్కడ ఇల్లు తీసుకున్నాడు బాగానే ఉంది కానీ భీమవరం ప్రజల గురించి అసెంబ్లీలో   గొంతెత్తి మాట్లాడుతానని చెప్పాడు, మరి అక్కడ కూడా ఇల్లు తీసుకున్నారా అని కూడా కామెంట్స్ వస్తున్నాయి.


ఇంతకీ పవన్ రెండుచోట్లా గెలిస్తే ఎక్కడ సీటు ఉంచుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు. ముందు అదిచెబితే ఉప ఎన్నికల గోల తప్పుతుంది కదా అని కూడా అంటున్నారు. గాజువాక కేరాఫ్ అడ్రస్ ఇచ్చేసిన పవన్ నిజానికి ఈ ఆలోచన ముందు వచ్చి ఉంటే నామినేషన్లకు ముందే ఎందుకు ఇల్లు తీసుకోలేదని కూడా డౌట్లు తెస్తున్నారు. నిజానికి గతంలో చాలామంది వలస నాయకులు విశాఖలో పేరుకు ఇళ్ళు తీసుకుని గెలిచిన తరువాత చాలా తక్కువ సార్లు వచ్చారు. మరి పవన్ ఏం చేస్తాడన్నది చూడాలి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: