వారం రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. తొలి దఫా కర్నూలు బహిరంగసభకు హాజరు కాగా.. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు సర్కార్ పై విరుచుకుపడ్డారు. ఈరోజు రాజమహేంద్రవరంలో బహిరంగసభకు విచ్చేశారు. తాను బాహుబలి అయితే చంద్రబాబు భల్లాలదేవుడని సెటైర్ వేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

 

దేశానికి చౌకీదార్ గా ఉన్నానని, ప్రజలకు సేవ చేసేందుకు మరొక్కసారి ఆశీర్వదించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన సభలో ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. రాబోయే తరానికి మంచి భవిష్యత్ ను ఇవ్వడానికి తనను మళ్లీ గెలిపించాలని కోరారు. పన్నులు చెల్లిస్తున్నవారి వల్లే దేశం అభివృద్ధి బాట పట్టిందన్న మోదీ.. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నిజాయితీగా పన్నులు చెల్లించడం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే చిన్న వ్యాపారులకు ఊరట కల్పిస్తూ పన్నుల్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపులు ఇస్తూ తీసుకున్న నిర్ణయం ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.

 

రాజమండ్రి, విశాఖ, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్ట్ ల విస్తరణకు బీజేపీ చొరవ తీసుకున్నదని మోదీ వివరించారు. 40 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని మోదీ ఆరోపించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ తొలి కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్న విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని మోదీ విమర్శించారు. పోలవరం అంచనాలు పెంచేస్తూ డబ్బులు తీసుకునే ఏటీఎంలాగా దాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని మోదీ మండిపడ్డారు. అందుకే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో వచ్చిన పథకాలను కూడా చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు.

 

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాహుబలిలా బీజేపీ పనిచేస్తుంటే చంద్రబాబు మాత్రం బల్లాలదేవుడి పాత్ర పోషిస్తున్నాడని మోదీ విమర్శించారు. గతంలో మాట్లాడిన మాటలను బాబు ఇప్పుడు పూర్తిగా మార్చేశారని అప్పుడు ఆయన మాట్లాడిన మాటలను అప్పటి పత్రికలు చూస్తే అర్థమవుతుందన్నారు. సేవామిత్ర పేరుతో రాష్ట్ర ప్రజల డేటా దొంగలించబడిందని మోదీ ఆరోపించారు. యూటర్న్ బాబు అంటూ మోదీ పదే పదే విమర్శిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

 

కేంద్రంలోనే కాక ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే ఎన్నో సమస్యలు పూర్తవుతాయని మోదీ చెప్పారు. తీరప్రాంతంలో జీవించే మత్యకారుల సంక్షేమ కోసం ప్రత్యేక శాఖను మంత్రిని బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మోదీ చెప్పారు. కిసాన్ కార్డులాగే మత్యకారులకు కూడా ప్రత్యేక కార్డులు పంపిణీ చేసి వారికి ప్రయోజనాలు అందిస్తోందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: