మూడు పార్టీలు....ముగ్గురు బలమైన నేతలు... ఒకే సామాజికవర్గం..ఇది పెడన పోరులో కనిపిస్తున్న ఎన్నికల చిత్రం... ఎన్నో ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌ నేతగా ఉన్న కాగిత వెంకట్రావు అనారోగ్య కారణాల వలన ఈసారి ఎన్నికల బరిలో నుంచి తప్పుకుని తన తనయుడు వెంకట కృష్ణప్రసాద్‌ని పోటీకి దించారు. అటు పెడన నుంచి 2009లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగి రమేశ్...ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీరికి ధీటుగా జనసేన కూడా గట్టి అభ్యర్ధినే నిలిపింది. నియోజకవర్గంలో కొంత ఫాలోయింగ్ ఉన్న అంకెం లక్ష్మి శ్రీనివాస్‌ని బరిలో దించింది. వీరు ముగ్గురు గౌడ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం విశేషం.


తండ్రి చేసిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కృష్ణప్రసాద్ ప్రజల దగ్గరకి వెళుతున్నారు. కాగిత కుటుంబానికి నియోజకవర్గంలో అనుచర వర్గాలు బాగానే ఉన్నాయి. గ్రామస్థాయిలో టీడీపీకి గట్టి కేడర్ ఉంది. కానీ పెడన పట్టణంలో పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. పైగా గత ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావు అనారోగ్యం వలన..అంత యాక్టివ్‌గా పనులు చేయలేదనే టాక్ ఉంది. ఇక కృష్ణప్రసాద్ కూడా తండ్రి పేరు చెప్పుకునే నెట్టుకు రావాల్సిన పరిస్తితి ఉంది.


ఇక నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ప్రచారం చేస్తూ వైసీపీ అభ్యర్ధి జోగి రమేశ్ బలపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండటం వలన...జోగికి ఇక్కడ ఫాలోవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత జోగికి కలిసిరావొచ్చు. కానీ ఈ ఐదేళ్లు నియోజకవర్గ సమన్వయకర్తగా కష్టపడి టికెట్ దక్కని ఉప్పల రామ్ ప్రసాద్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పైకి పార్టీకి సహకరిస్తానని చెబుతున్న...ఆయన అనుచర వర్గం మాత్రం జోగికి పూర్తిగా మద్ధతు తెలపకపోవచ్చు.


మరోవైపు ఈ రెండు పార్టీలకి ధీటుగా జనసేన అభ్యర్ధి శ్రీనివాస్ ఉన్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో ఈయనకి మద్ధతుదారులు ఉన్నారు. పైగా ఇక్కడ కాపు ఓటర్లు ఎక్కువ ఇదే జనసేనకి ప్లస్ అవుతుంది. ఇక ఇక్కడ బంటుమిల్లి, గూడూరు, కృత్తివెన్ను, పెడన మండలాలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలో కాపు, గౌడ కులాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాపు ఓట్లు సుమారు 45 వేల వరకు ఉండగా.. గౌడ కులంకు చెందిన ఓట్లు 35వేల వరకు ఉన్నాయి. ముగ్గురు గౌడ సామాజికవర్గం నేతలు కావడంతో...మిగిలిన వర్గాల ఓట్లపైన ఆధార పడనున్నారు. అయితే ఈ ముగ్గురు నేతల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. గెలుపు ఎవరికి ఈజీగా రాదని అర్ధమవుతుంది. ఏ పార్టీ అభ్యర్ధి గెలిచిన 3-4వేల లోపు మెజారిటీతోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: