తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారకరామారావు పుట్టిన గడ్డ నిమ్మకూరు. ఈ గ్రామం పామర్రు నియోజకవర్గంలోనే ఉంది.  దీంతో అన్నీ పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని పోటాపోటిగా ప్రచారం చేస్తున్నాయి. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా ఇక్కడ టీడీపీ ఓటమి పాలవుతూ వస్తుంది. 2009లో కాంగ్రెస్ గెలవగా...2014లో వైసీపీ గెలిచింది. అయితే వైసీపీ నుంచి గెలిచిన ఉప్పులేటి కల్పన ఆ తర్వాత టీడీపీ చేరారు. ఈ క్రమంలోనే ఈ సారి కూడా ఆమె టీడీపీ నుంచి పోటీ చేస్తుంది. టీడీపీలో చేరిన దగ్గర నుంచి పామర్రులో అభివృద్ది వేగంగానే జరిగింది. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడంతో..నారా లోకేశ్ నిమ్మకూరు గ్రామాన్ని , నారా భువనేశ్వరి కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. అటు సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యాయి. 


అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నాటి నుంచే నియోజకవర్గంలో కల్పన అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో ఆమె వైసీపీ నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేశారనే విమర్శలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీ కొంపముంచేలా కనిపిస్తోంది. అటు కల్పన టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ తరుపున నియోజకవర్గ బాధ్యతలనీ కైలా అనిల్ కుమార్ తీసుకున్నారు. ఈయనే ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అనిల్ అన్నీ గ్రామాల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేశారు. మునపటికంటే ఇక్కడ వైసీపీ బలం పెంచుకుంది. కల్పన టీడీపీలో చేరడం పట్ల కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఇదే వైసీపీ కలిసిరానుంది. ఇక జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ బీఎస్పీ పోటీ చేస్తోంది.


దీంతో ప్రధాన పోరు టీడీపీ-వైసీపీల మధ్య జరగనుంది. ఈ నియోజకవర్గంలో తోట్లవల్లూరు, పమిడిముక్కల, పామర్రు, మొవ్వ, పెదపారుపూడి మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఎస్సీ, కమ్మ, కాపు, బీసీ సామాజిక వర్గాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అయితే ఎస్సీలు ఎక్కువగా వైసీపీ వైపు ఉంటారు..కానీ ఈ సారి బీఎస్పీ పోటీ చేయడంతో కొంత చీలిక వచ్చే అవకాశం ఉంది. కమ్మ టీడీపీ వైపు ఉంటే, కాపుల్లో సైతం మెజార్టీ వ‌ర్గాలు టీడీపీకి ఎక్కువ మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డైరెక్ట్‌గా జనసేన పోటీలో లేకపోవడం వలన వారు టీడీపీ వైపే మొగ్గు చూపొచ్చు. బీసీలు టీడీపీ-వైసీపీలకి సమానంగా సపోర్ట్ ఇవ్వొచ్చు. అయితే కొంతవరకు ఇక్కడ వైసీపీకే కొంత ఎడ్జ్ కనపడుతుంది. కానీ ఎన్నికల సమయంలో జరిగే మార్పులు ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉంది.  


ఇక ఎన్టీఆర్ పుట్టిన గ‌డ్డ‌పై టీడీపీ సంస్థాగ‌తంగా బ‌లంగానే ఉన్నా గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ మాత్రం విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్భాగంగా ఉన్న పామ‌ర్రు కేంద్రంగా ఈ కొత్త నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డింది. 2009లో డీవై.దాస్ 13 వేల ఓట్ల భారీ మెజార్టీతో క‌ల్ప‌న‌పై విజ‌యం సాధించారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో క‌ల్ప‌న వైసీపీ నుంచి వ‌ర్ల రామ‌య్య‌పై 700 పై చిలుకు ఓట్ల స్వ‌ల్ప తేడాతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి గెలుపు అంత సులువుగా లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: