దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెలుగుదేశంపార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బిసిల్లో మెజారిటీ సెక్షన్ వైసిపి వైపు మొగ్గు చూపుతున్నారా ?  పరిస్ధితులు చూస్తుంటే అవుననే అనుమానం వస్తోంది.  టిడిపి ఇన్ని సంవత్సరాల పాటు బలంగా ఉందంటే అందుకు బిసిలే ప్రధాన కారణమని చెప్పాలి. ఇపుడు హఠాత్తుగా బిసిల్లోని మెజారిటి సెక్షన్ ఎందుకు టిడిపికి దూరమైంది ? ఎందుకంటే చంద్రబాబునాయుడు విధానాల వల్లే అని చెప్పాలి.

 

బిసిలను ఎన్టీయార్ ఓన్ చేసుకున్నట్లుగా చంద్రబాబు చేసుకోలేదు. ఏదో బహిరంగ సభల్లో బిసిలను పొగడ్డం, మొక్కుబడిగా బిసిలకు పదవులివ్వటం, పార్టీ కమిటీల్లో కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామనిపిస్తున్నారు. అన్నింటికన్నా ప్రధానంగా కమ్మ సామాజిక వర్గానికి పెద్దపీట వేయటం కోసం బిసిల్లో కోత విధించారు. దాంతో నెమ్మదిగా  బిసిలు టిడిపికి దూరమవటం మొదలుపెట్టారు.

 

అంతకన్నా ముందు కాపులను బిసిల్లో చేరుస్తామనే చంద్రబాబు హామీ కూడా పార్టీకి చేటు తెచ్చింది. అసలే గోదావరి జిల్లాల్లో బిసిలకు కాపులకు ఉప్పు నిప్పు లాగుంటుంది. అలాంటిది బిసి రిజర్వేషన్ల ఫలాలను కాపులకు కూడా పంచుతానని చంద్రబాబు చెప్పగానే బిసిలకు మండిపోయింది. అప్పటి నుండే చంద్రబాబుకు బిసిలు దూరంగా జరగటం మొదలైంది.

 

అదే సమయంలో బిసిలను దగ్గరకు తీసుకోకపోతే అధికారంలోకి రావటం కష్టమని జగన్ కూడా గ్రహించారు. దాంతో పార్టీలో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టారు.  బిసిల సంక్షేమం కోసమే ప్రత్యేకించి పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తామని హామీలిచ్చారు. దానికితోడు పాదయాత్ర సందర్భంగా కూడా ఎక్కడికక్కడ స్ధానిక బిసి నేతలను దగ్గరకు తీసుకున్నారు.

 

బిసిల్లో నమ్మకం పెంచటం కోసం వైసిపికి వచ్చిన ఒక్క ఎంఎల్సీ స్ధానాన్ని కూడా జగన్ బిసిలకే కేటాయించారు. దాంతో జగన్ పై బిసిలకు నమ్మకం పెరిగింది. ఎంఎల్ఏ, ఎంపిల టికెట్ల కేటాయింపులో కూడా బిసిలకు జగన్ అగ్రపీఠం వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అదే సమయంలో బిసిలకు  చంద్రబాబు కేటాయించిన టికెట్లు తక్కువే. దాంతో బిసిల్లో మెజారిటీ సెక్షన్ వైసిపి వైపు మొగ్గు చూపుతున్న విషయం అర్ధమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వేగంగా మారిపోతున్న సమీకరణలే అందుకు ఉదాహరణ. జిల్లాలోని మెజారిటీ బిసిలు ఇపుడు వైసిపి వైపు నిలిచినట్లు సమాచారం. దాంతో రాబోయే ఎన్నికల్లో టిడిపికి పెద్ద దెబ్బ పడటం ఖాయమనే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: