జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా ఉంటూ ఆదివాసీల‌కు నిల‌యంగా ఉండే పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ తీర్పు ఎప్పుడూ ఊహించ‌ని విధంగానే వ‌స్తుండ‌టం విశేషం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి.నరసాపురం, వేలేరుపాడు, కుక్కునూరు మండ‌లాలు ఉన్నాయి. 1955లో ఏర్ప‌డిన నియోజ‌క‌వ‌ర్గానికి ఇప్ప‌టి వ‌ర‌కు  13సార్లు సాధార‌ణ ఎన్నిక‌లు..రెండుసార్లు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల‌తో క‌లుపుకుని మొత్తం 15 సార్లు జ‌రిగాయి. ఇక్క‌డి నుంచి టీడీపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ, సీపీఐ పార్టీల అభ్య‌ర్థులు ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌య్యారు. విభిన్న తీర్పుతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు అన్ని పార్టీల‌ను ఆద‌రిస్తూ వ‌చ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధికులు ఆదివాసీలు కావ‌డం గ‌మ‌నార్హం. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతోంది. నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన తొలి మూడు ప‌ర్యాయాలు మాత్ర‌మే ఇక్క‌డ జ‌న‌ర‌ల్ స్థానంగా కేటాయింపు చేయ‌బ‌డింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా షెడ్యూల్ తెగ‌ల‌కే రిజ‌ర్వుడ్ కాబ‌డుతూ వ‌స్తోంది. 


మొద‌టి సారి ఇక్క‌డి సీపీఐ  పార్టీ విజ‌యం సాధించింది. పులుసూరి కోదండ‌రామ‌య్య ప్రాతినిధ్యం వ‌హించారు. ఆ త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ విజ‌యాలు న‌మోదు చేస్తూ వ‌చ్చింది. టీడీపీ 1983 ఆవిర్భావం త‌ర్వాత 1985లో తొలిసారిగా ఇక్క‌డ విజ‌యం సాధించింది. అటు త‌ర్వాత 1987 మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు, 1989లో సాధార‌ణ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. 1994, 1999ల్లో టీడీపీ త‌ర్వాత 2004, 2009లో కాంగ్రెస్‌, 2012 మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో వైసీపీ, 2014లో టీడీపీ విజ‌యం సాధిస్తూ వ‌చ్చాయి. నియోజ‌క‌వ‌ర్గం మొద‌టి నుంచి ఎక్క‌డ వ్య‌క్తిగ‌త‌, పార్టీల ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంటూ విభిన్న తీర్పున‌కు వేదికగా నిలుస్తూ వ‌స్తోంది. 


ఇప్పుడు టీడీపీ వైసీపీల మ‌ధ్య ప్ర‌ధానంగా పోరు కొన‌సాగనుంది. పార్టీల అభ్య‌ర్థులు షెడ్యుల్ తెగ‌ల‌కు చెందిన వారైనా...వారిని నియ‌మించేది న‌డిపించేది మాత్రం అగ్ర వ‌ర్ణాల‌కు చెందిన సామాజిక వ‌ర్గం నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం. పోల‌వ‌రంలో అనేక స‌మ‌స్య‌లు నెల‌కొని ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డి ఆరున్న‌ర ద‌శాబ్ధాలవుతున్న అభివృద్ధిలో మాత్రం అట్ట‌డుగునే ఉంద‌ని చెప్పాలి.  2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంత మార్పు వ‌చ్చింది. గుడ్డిలో మెల్ల అన్న చందంగా కొన్నిగ్రామాల‌కు ప్ర‌ధాన రోడ్లు అయితే ప‌డ్డాయి. అక్ష‌రాస్య‌త కూడా మెరుగైంది. సంప్ర‌దాయ వృత్తుల నుంచి ఉపాధి మార్గాలు, ఆధునిక వ్య‌వ‌సాయం వైపు ఆదివాసీలు మ‌ళ్లుతున్నారు.


 ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌తో కొంత మెరుగైన ప‌రిస్థితిలోకి వ‌చ్చారు.  పోల‌వ‌రం ప్రాజెక్టు నేప‌థ్యంలో ఈ ప్రాంతంలోని ఆదివాసీల జీవ‌న‌శైలి, సంస్కృతులు, వారి ఆర్థిక స్థితిగ‌తుల‌పై జాతీయ మీడియాలోనూ క‌థ‌నాలు క‌నిపించాయి. ఐటీడీఏకు కూడా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి నిధులు పెద్ద ఎత్తున అందుతుండటంతో గ‌మ‌నార్హం. ఏదిఏమైనా ఈసారి రాజ‌కీయ తీర్పు ఎలా ఉండ‌బోతోంద‌న్న‌దానిపై రాష్ట్ర రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ సాగుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో రూపు రేఖ‌లు మార‌గా తెలంగాణ నుంచి ముంపు మండ‌లాలు అయిన కుక్కునూరు, వేలేరుపాడు మండ‌లాలు సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో క‌ల‌వ‌డంతో వైశాల్య‌ప‌రంగా రాష్ట్రంలోనే పెద్ద నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టిగా మారింది.


ప్ర‌స్తుత బ‌లాబ‌లాలు.....
ప్ర‌స్తుతం టీడీపీ నుంచి గ‌తంలో ప్ర‌జారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బొర‌గం శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి 2004, 09తో పాటు 12 ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, వైసీపీ నుంచి వ‌రుస‌గా మూడుసార్లు గెలిచి హ్య‌ట్రిక్ కొట్టిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల‌రాజు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్ద‌రు అభ్య‌ర్థుల్లో బాల‌రాజు బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఉన్నార‌ని అక్క‌డ పొలిటిక‌ల్ ట్రెండ్ చెపుతోంది. గ‌తంలో మూడుసార్లు ఆయ‌న ఎమ్మెల్యేగా గెలుపొంద‌డంతో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌లం పుంజుకోవ‌డం, 2012 ఉప ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏకంగా 45 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంద‌డం ఆ పార్టీ బ‌లాలు. ఏదేమైనా నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన ప్ర‌భావం నామమాత్రం కావ‌డంతో ప్ర‌ధాన పోటీ టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్యే ఉంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి చూస్తే వైసీపీకి ఎడ్జ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: