ఉద్ధండులు ప్రాతినిధ్యం వ‌హించిన కాకినాడ పార్ల‌మెంట‌రీ సీటు కోసం ఈసారి త్రిముఖ పోరు నెల‌కొంది. మొత్తం ఐదు ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైసీపీ, జ‌న‌సేన నుంచి అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగుతున్నారు. అభ్య‌ర్థులంద‌రూ కూడా జిల్లాకు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తులే కావ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ నుంచి చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్‌, వైసీపీ నుంచి వంగా గీత‌, జ‌న‌సేన నుంచి జ్యోతుల వెంక‌టేశ్వ‌ర్‌రావు, కాంగ్రెస్ నుంచి శ్రీరామ‌చంద్ర‌మూర్తి, బీజేపీ నుంచి యాళ్ల దొర‌బాబు పోటీ చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 14ల‌క్ష‌ల‌కు పైగా ఓట‌ర్లు ఉండ‌గా  కాపులు, బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన ఓట‌ర్లే అధికంగా ఉన్నారు. ఈ సామాజిక వ‌ర్గాల ఓట‌ర్లు ఎటు వైపు మొగ్గితే అటు వైపు విజ‌యావ‌కాశాలు మెండుగా ఉండ‌నున్నాయి. 


ఇక అభ్య‌ర్థుల విష‌యానికి వ‌స్తే వైసీపీ నుంచి బ‌రిలో ఉన్న వంగా గీత టీడీపీ ఆవిర్భావం నుంచి సుదీర్ఘ‌కాలంగా ఆ పార్టీలో ప‌నిచేశారు. ఎన్టీఆర్‌కు అభిమానిగా  జిల్లా రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన ముద్ర‌వేశారు. తొలిసారిగా జ‌డ్పీటీసీగా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టారు. జ‌డ్పీటీసీగా ఎన్నికై తూర్పు గోదావ‌రి  జడ్పీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత కొంత‌కాలం పాటు  పార్టీ ముఖ్య ప‌ద‌వుల్లో ప‌నిచేశారు. ఆ పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు కూడా ఎన్నిక‌య్యారు.  పీఆర్పీ ఆవిర్భావంతో ఆ పార్టీలోకి మారి పిఠాపురం నుంచి బ‌రిలో నిలిచి గెలిచారు. ఇప్పుడు వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. సుధీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లోకి కొన‌సాగుతూ వ‌స్తుండ‌టం, జిల్లాలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో ప్ర‌త్య‌క్ష సంబంధాలు ఉండటం ఆమెకు క‌ల‌సి వ‌చ్చే అంశౄలుగా చెప్పుకోవాలి. అదే స‌మ‌యంలో కొంత పార్టీలోని వ‌ర్గ విభేదాలు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవ‌కాశ‌మూ క‌న‌బ‌డుతోంది. 


ఇక టీడీపీ అభ్య‌ర్థి చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ విదేశాల్లో వ్యాపారాలు నిర్వ‌హించుకుంటూ అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. పీఆర్పీ ఆవిర్భావంతో ఆయ‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. కాకినాడ ఆయ‌న స్వ‌స్థ‌లం కాదు. అయినా ఆయ‌న ఇక్క‌డి నుంచి పోటీ చేయ‌డానికి ఆస‌క్తిక‌న‌బ‌రుస్తూ వ‌స్తున్నారు. పీఆర్పీ నుంచి ఇదే స్థానానికి పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. త‌ర్వాత వైసీపీ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. మూడోసారి టీడీపీ నుంచి అదే స్థానానికి బ‌రిలోకి దిగుతుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌జ‌ల్లో త‌న‌పై సెంటిమెంట్ ఉంద‌ని ఈసారి గెలిపిస్తార‌ని విశ్వాసంతో ఉన్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ అతి స్వ‌ల్ప తేడాతో ఓడిపోవ‌డంతో ఈ సారి సెంటిమెంట్ ప‌రంగా ఆయ‌న‌కు క‌లిసి రానుంది.


జ‌న‌సేన అభ్య‌ర్థి వెంక‌టేశ్వ‌ర్‌రావు విష‌యానికి వ‌స్తే  తొలిసారి రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేస్తున్నారు. స్థానికుడు కావ‌డంతో కొంత ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం ఉంది. గ‌తంలో ఆయ‌న అల్లుడు బీజేపీ నుంచి ఇదే స్థానానికి పోటీ చేశారు. వియ్యంకుడు విశ్వం కూడా ఎమ్మెల్సీ, ఎంపీ ప‌ద‌వుల‌కు పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో విశ్వం పిఠాపురం నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. త‌క్కువ కాలంలోనే ఆయ‌న జ‌న‌సేన‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. కాకినాడ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 50వేల స‌భ్య‌త్వ న‌మోదులు చేయ‌డం ఆయ‌న‌కు గౌర‌వాన్ని తెచ్చిపెట్టింది. మొద‌ట‌గా కాకినాడ రూర‌ల్ అసెంబ్లీ నుంచి బ‌రిలోకి దిగాల‌ని చూసినా ఆయ‌న‌కు ఎంపీగా ప‌వ‌న్ అవ‌కాశం ఇచ్చారు. కాపుల ఓట్లు..ప‌వ‌న్ మేనియాతో కొంత బ‌లంగా క‌నిపిస్తున్నారు. అదే స‌మ‌యంలో వంగా గీత కూడా ఒకే సామాజిక వ‌ర్గం కావ‌డంతో కాపుల ఓట్లు చీలే అవ‌కాశం మెండుగా ఉంది. కాంగ్రెస్‌, బీజేపీ కొన్ని ఓట్లు చీల్చ‌గ‌ల‌వ‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం. త్రిముఖ పోరు..దోబుచులాట‌లో  ఏ పార్టీకి విజ‌యం ల‌భిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: