ఒంగోలు పార్ల‌మెంట‌రీ అభ్య‌ర్థుల‌ను క్రాస్ ఓటింగ్ భ‌య‌పెడుతోంది. ఎమ్మెల్యేలకు ప‌డిన ఓట్లు త‌మ‌కు ప‌డుతాయా..? అనే సందేహం వారికి కంటికి మీద కునుకు లేకుండా చేస్తోందంట‌. అసెంబ్లీ  నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎవ‌రికి వారు బ‌లంగా క‌నిపిస్తున్నా... అనేక సందేహాలు మ‌ళ్లీ వారిని కుదురుగా ఉండ‌నివ్వ‌ట్లేద‌ని స‌మాచారం. మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడ‌ని అంతా అనుకుంటున్న స‌మ‌యంలో అక‌స్మాత్తుగా ఆయ‌న వైసీపీలోకి జంప్ కావ‌డంతో టీడీపీ శ్రేణులు షాక్ తిన్నాయి. అదే స‌మ‌యంలో ద‌ర్శి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌నిచేస్తున్న శిద్ధాను ఒంగోలు ఎంపీ అభ్య‌ర్థిగా టీడీపీ నిల‌ప‌డంతో వైసీపీ ఖంగుతింది. తేలిక‌వుతుంద‌నుకున్న పోటీ ర‌స‌కందాయకంగా మారింది. ఇద్ద‌రు రాజ‌కీయ ఉద్ధండులే... జిల్లాలో  సుధీర్ఘ అనుభ‌వం ఉన్న నేత‌లుగా చెప్పుకోవ‌చ్చు. ఎవ‌రికి ఎవ‌రు తీసిపోరు.


ఇప్పుడు వీరిద్ద‌రికి ఒంగోలు పార్ల‌మెంటు ఎన్నిక ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారింది. త‌మ బ‌ల నిరూప‌ణ‌కు స‌వాల్‌గా మార‌డంతో ఇద్ద‌రు నేత‌లు స‌ర్వ‌శ‌క్త‌లు ఒడ్డుతున్నారు. తామేంటో నిరూపించుకోవ‌డ‌మే కాదు.. పార్టీ ప‌రువు నిలిపి అధినేత‌ల మ‌న‌సు గెల్చుకోవాల‌న్న‌ది ఇద్ద‌రి వ్యూహం. అందుకే ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విప‌రీత‌మైన ప్ర‌చారంతో హోరెత్తిస్తున్నారు. ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్నా కొద్దీ ప్ర‌చారం హోరు ఉధృతం చేస్తున్నారు. ఎమ్మెల్యేల గెలుపుపైనే త‌మ గెలుపు ఆధార‌ప‌డి ఉండ‌టంతో వారితో క‌ల‌సి సాగుతున్నారు. మార్కాపురంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందుల నారాయ‌ణ‌రెడ్డి మ‌ళ్లీ బ‌రిలోకి దిగ‌గా..వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి త‌న‌యుడు నాగార్జున‌రెడ్డి పోటీలో ఉన్నారు. 


య‌ర్ర‌గొండ‌పాలెంలో ఈసారి వైసీపీ నుంచి   సంత‌నూత‌న‌ల‌పాడు ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ పోటీ చేస్తున్నారు. 2009లో ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. 2014లో సంత‌నూత‌న‌ల‌పాడు నుంచి పోటీ చేసి అక్క‌డా విజ‌యం సాధించారు. ఇప్పుడు తిరిగి సొంత నియోజ‌క‌వ‌ర్గం య‌ర్ర‌గొండ‌పాలెం నుంచి బ‌రిలో దిగారు. ఇక టీడీపీ నుంచి ఇక్క‌డ టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన బుడాల అజిత‌రావు బ‌రిలో ఉన్నారు. గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి గెలిచిన ముత్త‌ముల అశోక్‌రెడ్డి అనంత‌రం టీడీపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేస్తుండ‌గా.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. 


క‌నిగిరి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా  మాజీ ఎమ్మెల్యే ఉగ్ర‌నర‌సింహ‌రెడ్డి..వైసీపీ అభ్య‌ర్థిగా బుర్రా మ‌ధుసూద‌న్‌యాద‌వ్ పోటీ చేస్తున్నారు. కొండాపి నియోజ‌క‌వ‌ర్గంలో  టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలా వీరాంజ‌నేయ‌స్వామి..వైసీపీ నుంచి మాదాసి వెంక‌య్య పోటీ చేస్తున్నారు. ఒంగోలు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్..వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాస‌రెడ్డి, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం నుంచి క‌నిగిరి ఎమ్మెల్యే బాబురావు..వైసీపీ నుంచి మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టి వర‌కు ఉన్న ట్రెండ్ బ‌ట్టి చూస్తే కొండ‌పిలో టీడీపీకి, య‌ర్ర‌గొండ‌పాలెంలో వైసీపీ ఎడ్జ్ క‌న‌ప‌డుతోంది. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌న్నింటిలో ట‌ఫ్ ఫైట్ ఉంది. ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే మెజార్టీయే ఒంగోలు ఎంపీ సీటు గెలుపును డిసైడ్ చేయ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: