ఏపీలో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుగుతోన్న హాట్ సీట్ల‌లో గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఒక‌టి. మళ్ళీ పాత ప్రత్యర్ధులే సత్తెనపల్లిలో హోరాహోరీగా తలపడుతు న్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు కేవలం 924 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబుపై గెలిచారు. ఈ క్రమంలోనే ఈసారి భారీ మెజారిటీతో గెలవాలని కోడెల చూస్తుంటే...ఈ సారి అయిన కోడెలని ఓడించాలని అంబటి కసితో ఉన్నారు. ఇక వీరిద్దరు మధ్యలో నేను ఉన్నానని జనసేన అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే య‌ర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీకి దిగుతున్నారు. ఎంత జనసేన పోటీలో ఉన్న కోడెల-అంబటిల మధ్యనే అసలు పోరు జరగనుంది.

ఇక ఎమ్మెల్యేగా గెలిచాక కోడెల ఏపీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. శాసన సభ స్పీకర్‌గా ఉంటూనే కోడెల అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేసి పేరు సంపాదించారు. రాష్ట్రంలోనే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ విషయంలో సత్తెనపల్లిని నెంబర్1గా ఉంచారు. అటు అభివృద్ధి కూడా బాగానే జరిగింది. సంక్షేమ పథకాలు కూడా కోడెలకి ప్లస్ కానున్నాయి. అయితే స్పీకర్‌ తనయుడు శివరామ్‌ వ్యవహార తీరు  కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. అధికారిక వ్యవహారాల్లో తలదూర్చి భూకబ్జాలు లాంటివి చేశారని, సత్తెనపల్లిలో వ్యాపారస్తుల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. స‌త్తెన‌ప‌ల్లిలో గ‌త ఐదేళ్ల‌లో కేఎస్‌పీ ట్యాక్స్ బాగా పాపుల‌ర్ అయ్యింది. 


చివ‌ర‌కు కోడెల‌కు స‌న్ స్ట్రోక్ గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో స‌త్తెన‌ప‌ల్లిలో సీటు ఇవ్వొద్ద‌ని సొంత పార్టీ నేత‌లే ఫైర్ అయ్యారు. చివ‌ర‌కు ఏదోలా సీటు ద‌క్కించుకున్నారు. ఎంపీగా పోటీ చేస్తోన్న రాయ‌పాటితోనూ కోడెల‌కు స‌ఖ్య‌త లేదు. మరోవైపు అంబటి కూడా ఈ సారి గెలవాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. అందరినీ కలుపుకుని పోతూ...ఎమ్మెల్యే వ్యతిరేక విధానాలని ప్రజలకి తెలిసేలా చేస్తూ విజయం సాధించాలని అనుకుంటున్నారు. అదేవిధంగా పార్టీకి పెరిగిన బలం అంబటికి కలిసిరావొచ్చు. అయితే వైసీపీలో అంబటికి టికెట్ ఇవ్వొద్దని ఆందోళన చేసిన  వ్యతిరేక వర్గం...ఎన్నికల్లో ఏ మేర సహకరిస్తారో చెప్పలేం. ఈ వ్యతిరేకత, జనసేన పోటీలో ఉండటం అంబటికే మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.


ఇక్కడ ఉన్న కాపు ఓట్లు, పవన్ ఇమేజ్ మీదే ఆధారపడి జనసేన అభ్యర్ధి వెంకటేశ్వరరెడ్డి ప్రచారం చేస్తున్నారు. జనసేనకి గెలిచే అంత సత్తా లేదు గాని..గెలుపోటములని తారుమారు చేసే అవకాశం మాత్రం ఉంది. ఈ నియోజకవర్గంలో సత్తెనపల్లి టౌన్‌తో పాటు, రూర‌ల్‌, రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ల‌ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో కమ్మ, ముస్లిం, మాదిగ, కాపు, రెడ్డి, బీసీలు కీలకంగా ఉన్నారు.  ప్రస్తుత సమీకరణలు బట్టి చూస్తుంటే కొంత వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తున్న..కోడెలని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు పార్టీలు ఇస్తున్న హామీల, మద్యం, నగదు ప్రభావం కూడా ఎన్నికల రోజు ఉండొచ్చు. ఫలితాలు వచ్చే మే 23నే ఇంకా వీరి భవతవ్యం తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: