రాష్ట్రంలో టీడీపీ-వైసీపీ-జనసేనల మధ్య హోరాహోరీగా త్రిముఖ పోరు జరిగే నియోజకవర్గాల్లో గుంటూరు పశ్చిమ ఒకటి. ఇప్పటికే మూడు పార్టీల అభ్యర్ధులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. అయితే గుంటూరు పశ్చిమలో సినీ గ్లామర్ కూడా యాడ్ అయింది. బీజేపీ అభ్యర్ధిగా హీరోయిన్ మాధవీలత పోటీ చేస్తున్నారు. కానీ బీజేపీకి ఇక్కడ అంత సీన్ లేదనే విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మద్దాలి గిరి...ఈసారి పశ్చిమ నుంచి బరిలోకి దిగుతున్నారు. టీడీపీకి ఇక్కడ బలమైన కేడర్ ఉంది. రాజధాని ప్రాంతం కావడంతో ఈ ఐదేళ్లు అభివృద్ధి బాగా జరగడం, సంక్షేమ పథకాలు ప్రజలకి అందడం గిరికి కలిసొచ్చే అంశాలు. అయితే నగరు శివారు ప్రాంతాల్లో టీడీపీకి అంతగా పట్టులేకపోవడం, వైసీపీ, జనసేనలు కూడా బలంగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.


గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 19 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ఇప్పుడు మోదుగుల వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ అభ్య‌ర్థిగా రంగంలో ఉన్నారు. ఇక పోలీసు శాఖలో పని చేసి వచ్చిన వైసీపీ అభ్యర్ధి చంద్రగిరి ఏసురత్నంకి... అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే మనస్తత్వం ఉందని పేరుంది. బీసీల్లోని వ‌డ్డెర సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఈయ‌న‌కు ఆ వ‌ర్గాల నుంచి బ‌ల‌మైన స‌పోర్ట్ ల‌భిస్తోంది. 
అలాగే ఈయనకి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ పరోక్షంగా మద్ధతు ఇస్తున్నారని టాక్ ఉంది. పైగా గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి...ఇప్పుడు వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్దిగా పోటీ చేయటం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.  


అటు జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ పోటీకి దిగుతున్నారు. ఐ‌ఏ‌ఎస్ అధికారి కావడం వలన చంద్రశేఖర్ పట్ల నగర ఓటర్లలో కొంత సానుకూలత ఉండొచ్చు. ఆయ‌న గ‌తంలో ప్ర‌జారాజ్యం నుంచి ఇక్క‌డ ఎంపీగా పోటీ చేసి ఓడినా స‌త్తా చాటారు. అలాగే ఇక్కడ పవన్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే టీడీపీ-వైసీపీకి ఉన్నంత కేడర్ జనసేనకి లేకపోవడం మైనస్. ఇక ఈ నియోజకవర్గం మొత్తం గుంటూరు నగరంలోనే ఉంది. ఇక్కడ కాపు, కమ్మ, బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నగర ప్రాంతం కావడంతో అన్నీ మతాల, కులాల ప్రజలు ఉంటారు.  ఇప్పుడు ఉన్న పరిస్థితులని బట్టి చూస్తే మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. మూడు పార్టీల పోటీలో ఎవ‌రు గెలుస్తారో ? అంచ‌నాకు రాలేని ప‌రిస్థితి. ఇక గుంటూరు జిల్లాలో జ‌న‌సేన స‌త్తా చాటా నియోజ‌క‌వ‌ర్గాల్లో గుంటూరు వెస్ట్ తొలి స్థానంలో ఉంది. ఇక్క‌డ స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి ఆ పార్టీ గెలిచే ఛాన్స్ కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: