సరిగ్గా పోలింగ్‌కు పది రోజులు కూడా లేని సమయంలో తెలుగుదేశానికి ఈడీ మరో షాక్ ఇచ్చింది. ఆ పార్టీ కోశాధికారిలా వ్యవహరించే ఎంపీ సుజనా చౌదరికి చెందిన ఆస్తులను జప్తు చేసింది. దాదాపు 315 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. 


సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై గతంలోనూ ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మారిషస్ బ్యాంకు వ్యవహారం కోర్టుల వరకూ వెళ్లింది. తాజాగా.. బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని, వాటిని డొల్ల కంపెనీల ద్వారా తన సంస్థకు దారి మళ్లించిన ఆరోపణలుపై ఈడీ చర్యలు ప్రారంభించింది. 

ఈ కేసులో ఇప్పటికే  సీబీఐ విచారణ పూర్తయింది. ఆ విచారణను సీబీఐ ఈడీకి బదిలీ చేసింది. కేసును విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుజనా గ్రూప్‌కి సంబంధించిన రూ.315 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసింది. సుజనా చౌదరి బీసీఈపీఎల్ కంపెనీ ద్వారా రూ.364 కోట్ల రుణం తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. 

చెన్నైలోని ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ నుంచి సుజనా లోన్ తీసుకున్నారు. అయితే ఆ సొమ్మును సుజనా చౌదరికే చెందిన డొల్ల కంపెనీలకు మళ్లించారు.  షెల్ కంపెనీల నుంచి వైశ్రాయ్ హోటల్స్, మహల్ హోటల్‌కు సుజనా గ్రూప్ బదిలీ చేసినట్టు సీబీఐ గుర్తించింది. కేసును ఈడీకి బదిలీ చేయడంతో ఈడీ 315 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. మరి ఈ దాడులు ఆగుతాయా.. ఇంకా కొనసాగుతాయా అన్నది వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: