చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం....దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావంలో పార్టీకి కంచుకోటగా ఉన్న..1989లో టీడీపీ నుంచి పోటీకి దిగిన చంద్రబాబు..నిదానంగా తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక అప్పటి నుంచి 2014 వరకు చంద్రబాబే భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో పోలిస్తే 2014 ఎన్నికల్లో కాస్త మెజారిటీ తగ్గినప్పటికీ ప్రత్యర్థులకు ఏ మాత్రం అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో కూడా ఆయనే మరోసారి బరిలోకి దిగుతున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గంలో తన ఉనికిని ప్రస్తుతం దాదాపు కోల్పోయిందనే చెప్పవచ్చు. ఈసారి కూడా సమీప అభ్యర్ధిగా వైసీపీ నుంచి కె.చంద్రమౌళి బరిలో ఉన్నారు. జనసేన నుంచి ముదినేని వెంకటరమణ పోటీ చేస్తున్నారు.


కుప్పంలో చంద్రబాబు అనుకూలత అంశాల గురించే పెద్దగా చెప్పేది ఏమి లేదు ఆయనే పెద్ద ప్లస్ పాయింట్. ఇన్ని సార్లు గెలిచిన చంద్రబాబు జిల్లా మారుమూలన ఉన్న కుప్పంలో చేసిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. అన్నీ రంగాల్లోనూ కుప్పాన్ని రాష్ట్రంలోనే నెంబర్‌1 నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. పార్టీ అధ్యక్షుడుగా, సీఎంగా ఉండటంతో కుప్పం ప్రజలు చంద్రబాబు వైపే ఉంటారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో బిజీగా ఉండటంతో ఆయన సతీమణి భువనేశ్వరి నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ లక్ష మెజారిటీ టార్గెట్‌గా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. అయితే కుప్పం నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల పనులు జరిగినా కూడా అక్కడ టీడీపీ నేతల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీని వలన కొంత మెజారిటీ తగ్గుతుందనే ప్రచారం జరుగుతుంది.


అటు చంద్రమౌళి కూడా చంద్రబాబు మెజారిటీ తగ్గించడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. 1989 నుంచి వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌స్తోన్న చంద్ర‌బాబుకు ఈ సారి గ‌తంతో పోలిస్తే మెజార్టీ విష‌యంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక చంద్ర‌మౌళి పార్టీ కేడర్‌ని సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆరోగ్యం సహకరించాక పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోతున్నారని తెలుస్తోంది. అటు జనసేన అభ్యర్ధి ప్రభావం ఏ మాత్రం ఉండదని అర్ధమవుతుంది. ఇక కుప్పంలో గుండుపల్లి, రామకుప్పం, కుప్పం, శాంతిపురం మండలాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ప్రధానంగా వన్నెకుల క్షత్రియ, కురబ, బలిజ, గాండ్ల సామాజిక వర్గాలు ఉంటాయి. వీరిలో అందరికంటే వన్నెకుల క్షత్రియ కులం వారు అధికంగా ఉన్నారు. ఈ వర్గంతో పాటు కురబ కులం ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.


అయితే అన్నీ సామాజికవర్గాలు చంద్రబాబు వైపే మొగ్గు చూపుతారు. మొత్తం మీద ఇక్కడ చంద్రబాబు గెలుపుకి ఏ మాత్రం ఢోకా లేదు. కానీ గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఇప్పుడు పెరుగుతుందో...తగ్గుతుందో అని ప్రజల్లో చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో 47వేల మెజారిటీతో చంద్రబాబు గెలిచారు. మరి ఈ సారి కుప్పం ప్రజలు చంద్రబాబుని గెలిపించినా ఆయ‌న మెజార్టీ విష‌యంలో గ‌తంతో పోలిస్తే త‌గ్గుద‌ల ఉండొచ్చ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: