పులివెందుల వైఎస్ కుటుంబం అడ్డా 1978 నుంచి ఆ ఫ్యామిలీ హవానే ఇక్కడ నడుస్తోంది. వైఎస్ మరణం తర్వాత వైసీపీ పార్టీ ద్వారా జగన్ మోహన్ రెడ్డి 2014 ఎన్నికల్లో దాదాపు 75వేల మెజారిటీతో గెలుపొందారు. ఈ సారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. అటు నాలుగు దఫాలుగా టీడీపీ తరుపున వైఎస్ కుటుంబాన్ని ఢీకొంటున్న సతీశ్ రెడ్డి మరోమారు పోటీలో దిగారు. ఇక జనసేన కూడా ఇక్కడ పోటీ చేస్తోంది. ఆ పార్టీ తరుపున తుపాకుల చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. ఓ పార్టీ అధ్యక్షుడుగా..సీఎం అభ్యర్ధిగా ఉన్న జగన్‌కి పులివెందులపై పూర్తి పట్టుంది. ఇక్కడ అన్నీ సామాజికవర్గాలు వైఎస్ ఫ్యామిలీ వైపే ఉన్నారు. పైగా సొంత సామాజికవర్గం రెడ్డి ఓటర్లు దాదాపు లక్షపైనే ఉన్నారు. ఇక బలహీనతలు ఎన్ని ఉన్న వైఎస్ కుటుంబం బలం ముందు సరిపోవు. 


ఇక జగన్‌ని ఓడించాలని చంద్రబాబు ఎన్నో రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక. పులివెందులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. త్రాగు, సాగు నీరందించటం, సంక్షేమ పథకాలు అమలు చేయటం, మౌళిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. సతీశ్ రెడ్డి కూడా పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటూ...ప్రజల సమస్యలపై పోరాటం చేశారు. ఇలా టీడీపీకి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్న జగన్ ఢీకొని గెలవడం అసాధ్యమైన పని. మరి వీరి మధ్యలో జనసేన అభ్యర్ధి ఏ మేర నెట్టుకొస్తాడనేది చూడాలి. జనసేన అభ్యర్ధికి 10 వేల ఓట్లు వస్తే గొప్పే అని చెప్పాలి. ఇక నియోజకవర్గంలో సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాలు ఉన్నాయి. ఇక ఇక్కడ రెడ్డి సామాజికవర్గ ఓటర్లే ఎక్కువ. సింహాద్రిపురం, లింగాల, వేముల, పులివెందులలో రెడ్డి వర్గానికి చెందిన ఓటర్ల సంఖ్యాబలమే ఎక్కువగా ఉంది. 


వేంపల్లె, చక్రాయపేటలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండగా.. తొండూరు మండలంలో యాదవ సంఖ్యాబలం ఎక్కువగా ఉంది. రెడ్డి సామాజివర్గం మొత్తం జగన్‌వైపే ఉంటారనేది తెలిసిన విషయమే. అయితే కొందరు సతీశ్‌కి మద్ధతు తెలిపే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇక్కడ జగన్‌ని గెలుపుని ఆపడం అసాధ్యమైన పని. అయితే గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఈ సారి పెరుగుతుందా ?  లేదా ? త‌గ్గుతుందా ? అన్న‌ది ఒక్క‌టే చూడాలి.  టీడీపీ సంక్షేమ పథకాలు, సతీశ్ రెడ్డి పోరాట తీరు పట్ల ప్రజలు కొంత సానుకూలంగానే కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్‌కి 1,24,576 ఓట్లు రాగా, సతీశ్ రెడ్డికి 49,333 ఓట్లు వచ్చాయి. మొత్తానికి ఇక్కడ వార్ వన్ సైడ్‌గా జరగనుంది. సీమ‌లో ఈ సారి మెజార్టీ వ‌ర్గాలు జ‌గ‌న్ సీఎం కావాల‌ని కోరుకుంటున్నాయి. పులివెందుల‌లోనూ త‌మ నియోజ‌క‌వ‌ర్గ వాసి సీఎం అవుతున్నాడ‌న్న సంతోషంగా జ‌గ‌న్‌కు భారీ మెజార్టీ క‌ట్ట‌బెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: