ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం రాష్ట్ర రాజ‌కీయాల‌కు ప్ర‌తిబింబంగా నిలుస్తూ వ‌స్తోంది. ఇక్క‌డ గెలిచిన పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది పార్టీల న‌మ్మకం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ దాదాపుగా  అదే జ‌రిగింది. ఈసారి జ‌రిగే పోరుపైనా ఆస‌క్తి నెలకొంది. నియోజ‌క‌వ‌ర్గంలో  2ల‌క్ష‌ల 38వేల పైచిలుకు ఓట‌ర్లు ఉన్నారు. అత్య‌ధికంగా బీసీ ఓట‌ర్లు సుమారు 85వేలు, కాపులు 45వేలు, ఆ త‌ర్వాత స్థానాల్లో వ‌రుస‌గా రెడ్లు, ద‌ళిత‌, మైనార్టీలు ఉన్నారు. ఇక్క‌డ అభ్య‌ర్థుల‌కు ద‌ళిత‌, మైనార్టీలే ఒట్లే కీల‌కంగా మార‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి 12 సార్లు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా ఆరుసార్లు కాంగ్రెస్‌, ఐదుసార్లు టీడీపీ ఒక‌సారి స్వ‌తంత్ర అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. 


నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం నాలుగు మండ‌లాల్లో విస్త‌రించి ఉంది. ఉంగుటూరు, భీమ‌డోలు, గ‌ణ‌ప‌వ‌రం, నిడ‌మ‌ర్రు మండ‌లాలు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తాయి. నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నికైన వారిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇద్ద‌రు మంత్రి ప‌ద‌వులు చేప‌ట్టారు. అందులో ఒక‌రు..చింత‌ల‌పాటి ప్ర‌సాద‌మూర్తిరాజు దేవాదాయ‌శాఖ‌కు ప‌నిచేయ‌గా...కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యంలో వ‌ట్టి వసంత‌కుమార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌నిచేశారు.  ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆక్వారంగంలో ప్ర‌గ‌తి సాధించింది. మొత్తం 75వేల ఎక‌రాల్లో వ‌రి సాగు జ‌రుగుతుండ‌గా 25వేల ఎక‌రాల్లో ఆక్వా సాగు జ‌రుగుతోంది. ప్ర‌సిద్ధిగాంచిన కొల్లేరు స‌ర‌స్సు నాలుగు మండ‌లాల్లో విస్త‌రించి ఉండ‌టం గ‌మ‌నార్హం.


ప్ర‌స్తుతం జ‌రిగే ఎన్నిక‌ల‌పై అన్ని పార్టీల క‌న్ను ప‌డింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భ‌వానికి ముందు ఆ త‌ర్వాత కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం ఆన‌వాయితీగా ఉంటూ వ‌స్తోంది. 2004, 2009ఎన్నిక‌ల్లో ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి వ‌ట్టి వ‌సంత‌కుమార్ విజ‌యం సాధించారు. అలాగే 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌న్ని వీరాంజ‌నేయులు టీడీపీ నుంచి విజ‌యం సాధించారు. మ‌ళ్లీ టీడీపీ ఇక్క‌డ జెండా ఎగుర‌వేయాల‌ని చూస్తోంది. అలాగే వైసీపీ కూడా పావులు క‌దుపుతోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌తో కాంగ్రెస్ శ్రేణులు అటు వైసీపీకో..ఇటు టీడీపీలోనే చేరిపోవ‌డంతో ఆ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. జ‌న‌సేన కూడా బ‌రిలో ఉంటోంది. దీంతో ప్ర‌స్తుతం గెలుపెవ‌రిది..? అంటే మాత్రం చెప్ప‌డం చాలా క‌ష్టంగా మారింది. మొత్తంగా ట‌ఫ్ ఫైట్‌గా క‌న‌బ‌డుతోంది.


జ‌న‌సేన నుంచి ఇక్క‌డ బీసీ వ‌ర్గానికి చెందిన నౌడు వెంక‌ట‌ర‌మ‌ణ రేసులో ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్ అభిమానులు, కాపు వ‌ర్గం ఓట‌ర్లు కూడా బ‌లంగానే ఉన్నారు. దీంతో జ‌న‌సేన గెలుపు సంగ‌తి ఎలా ఉన్నా ప్ర‌ధాన పార్టీల గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌వ‌చ్చు. ఇక ఉంగుటూరులో సెంటిమెంట్ మ‌ళ్లీ రిపీట్ అవుతుందా ?  ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారు ?  స్టేట్‌లో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది ? అన్న‌ది చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: