రాష్ట్రంలో అందరూ దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తున్న నియోజకవర్గం మంగళగిరి... ఎందుకంటే ఇక్కడ నుంచి సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ తొలిసారి పోటీ చేయడమే. 2014 లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో లోకేశ్ ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయ్యాడు. దీంతో ప్రతిపక్షాలు అన్నీ దొడ్డిదారిన మంత్రి అయ్యాడని తీవ్ర విమర్శలు చేశాయి. ఇక ఆ విమర్శలకి చెక్ పెట్టేందుకు గానూ... లోకేశ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన దిగడం దిగడమే టీడీపీ రెండు సార్లు మాత్రమే గెలిచిన మంగళగిరి బరిలో దిగారు. ఎన్టీఆర్ హవా ఉన్న 1983, 85లలో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది... ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఎక్కువసార్లు పోటీ చేసే అవకాశం రాలేదు.


ఏది ఏమైనా ఓ రకంగా మంగళగిరి నుంచి పోటీ చేస్తూ నారా లోకేశ్ సాహసం చేస్తున్నారనే చెప్పొచ్చు. అయితే ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు మంగళగిరిలో లేవనే చెప్పాలి. ఈ స్థానం రాజధాని ప్రాంతంలో ఉండటంతో ఈ ఐదేళ్లు అభివృధ్ది పరుగులు పెట్టింది. అలాగే ఐటీ మంత్రిగా లోకేశ్ కొన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలని మంగళగిరికి తీసుకొచ్చారు. ఇవే అంశాలని దృష్టిలో పెట్టుకుని లోకేశ్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. తనని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ కేడర్ కూడా బలంగానే ఉంది. అయితే లోకేశ్‌కి నియోజకవర్గానికి కొత్త కావడం.. సరైనా పట్టు లేకపోవడం మైనస్ అయ్యేలా ఉన్నాయి.   పైగా ప్రచారంలో తడబాట్లు కూడా లోకేశ్‌కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.


మరోవైపు గత ఎన్నికల్లో కేవలం టీడీపీపై కేవలం 12 ఓట్ల తేడాతో బయటపడ్డ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంపై బాగానే పోరాటం చేశారనే పేరు ఆళ్ళ సంపాదించుకున్నారు. రాజధాని ప్రాంతంలోని భూములు ఉన్న రైతుల తరుపున పోరాటాలు కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. పైగా లోకల్ లీడర్‌ కావడం...సామాన్యుడుగా ప్రజల మధ్యలో ఉండటం...వైసీపీ కేడర్ బలంగా ఉండటం ఆళ్ళకి కలిసొచ్చే అంశాలు. అయితే వైసీపీలో గ్రూపు రాజకీయాలు ఉండటం...ఎమ్మెల్యేగా ఉండి పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉండటం మైనస్ అయ్యే అవకాశం ఉంది.


అటు జనసేన పొత్తులో భాగంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పోటీచేస్తున్నారు. ఒకప్పుడు మంగళగిరి కమ్యూనిస్టులకు కంచుకోటగానే ఉండేది. కానీ ఇప్పుడు వారికి అనుకూల వాతావరణం లేదు. అయితే ముప్పాళ్ళకి నియోజకవర్గంలో సమస్యలపై పోరాడతారనే మంచి పేరుంది. వీరికి కొంత అనుకూలమైన ఓటింగ్ కూడా ఉంది. పైగా పవన్ ఇమేజ్ కూడా సీపీఐకి కలిసిరావొచ్చు. కానీ వీరికి గెలిచే అంత కెపాసిటీ లేదనే చెప్పాలి. సీపీఐతో పాటు, కాంగ్రెస్, బీజేపీలు పోటీలో ఉన్న....అసలు పోరు లోకేశ్-ఆళ్ళ మధ్యనే జరగనుంది.


ఇక ఈ నియోజకవర్గంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. ఇక ఇక్కడ మాదిగ, చేనేత సామాజికవర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువ ఉంటారు. వీరే అభ్యర్ధుల తలరాతని మార్చే అవకాశం ఉంది. ఈ రెండు వర్గాలు కలిపి 74వేల వరకు ఉన్నారు. ఆ తర్వాత బీసీ, మాల, కాపు, కమ్మ, రెడ్డి, ముస్లింలు కీలకంగా వ్యవహరించనున్నారు. మొత్తం మీద చూసుకుంటే లోకేశ్, ఆళ్ళ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. గెలుపు అవకాశాలు ఇద్దరికీ సమానంగానే ఉన్నాయి. అయితే ఎన్నికల సమయంలో  చోటు చేసుకునే పరిణామాలు బట్టి అభ్యర్ధుల గెలుపు డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి తొలిసారి పోటీ చేస్తున్న లోకేశ్ గెలుస్తాడో లేక లోకల్ లీడర్‌గా ఉన్న ఆళ్ళ గెలుస్తాడో ?



మరింత సమాచారం తెలుసుకోండి: