ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన , వామపక్షాలు, బీఎస్పీ కలిసి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ కూటమి తరఫున ఎన్నికల ప్రచారానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏపీకి మంగళవారం వచ్చారు. బుధవారం విశాఖలో పవన్, మాయావతి సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో నాటి పరిస్థితులను బట్టి టీడీపీ, బీజేపీలతో కలిసి ముందుకు వెళ్లామని పేర్కొన్నారు. మాయావతికి సాదర స్వాగతం పలుకుతున్నామని అన్నారు. మాయావతి ప్రధాని కావడం ఖాయమని, ఆమె సమర్ధత దేశానికి అవసరమని పవన్ కల్యాణ్  వ్యాఖ్యానించారు. దారితప్పిన సొంత ఎమ్మెల్యేలనే మాయావతి క్షమించలేదని పవన్ ప్రశంసలు కురిపించారు.


మాయావతి మాట్లాడుతూ... మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే జనసేనతో బీఎస్పీ పొత్తుపెట్టుకుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ అభివృద్ధి చేయలేదని ఆమె విమర్శించారు. అభివృద్ధే చేసుంటే రాష్ట్ర విభజన జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల పాలనలోనూ అలాంటి పరిస్థితే ఉందని మాయ ధ్వజమెత్తారు. మా కూటమి అధికారంలోకి వస్తుందని, పవన్ కల్యాణే సీఎం అవుతారని ఉద్ఘాటించారు. పవన్ లాంటి యువ నాయకులు రాజకీయాల్లోకి రావడం శుభపరిణామని, యూత్‌లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని అన్నారు.


హామీలను నెరవేర్చనందునే ఢిల్లీ పీఠానికి కాంగ్రెస్ దూరమైందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కూడా మాటనిలబెట్టుకోలేదని, . ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ దెందూ దొందేనని ధ్వజమెత్తారు. మా కూటమి విజయవంతమవుతుందని.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులు ఓట్లతో శాసిస్తారని, అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తామని మాయ హామీ ఇచ్చారు. తాము కేంద్రంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ఆమె పునరుద్ఘాటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: