ఏపీలో జరిగే ఎన్నికల్లో గెలిచేదెవరు అన్నది ఆసక్తికరమైన అంశమే. అటు టీడీపీ, ఇటు వైసీపీ హోరా హోరీగా పోరాడుతున్నాయి. మధ్యలో జనసేన కూడా ఉంది. ఆ ఫ్యాక్టర్ ఏంటో ఎవరికీ తెలియడంలేదు. ఈ పరిస్థితుల్లో గెలిచేది నిలిచేది ఎవరు అన్న చర్చ  హాట్ హాట్ గా సాగుతోంది. 


దీని మీద ఇప్పటికే అనేక జాతీయ సర్వేలు వైసీపీకి అనుకూలంగా తీర్పు చెప్పాయి. వచ్చేది వైసీపీ సర్కారేనని కూడా కుండ బద్దలు కొట్టాయి. ఇక లేటెస్ట్ గా దేశంలోనే ప్రముఖ సెఫాలజిస్ట్, సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ అధినేత డాక్టర్ వేణుగోపాలరావు ఏపీలో కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని సర్వే నివేదికను ఇచ్చేశారు. వైసీపీకి మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 121 నుంచి 130 సీట్ల వరకూ వస్తాయని ఆయన చెప్పారు.


అదే విధంగా తెలుగుదేశానికి 45 నుంచి 54 వరకూ సీట్లు వస్తాయని, మిగిలిన వాటిలో జనసేన రెండు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయని ఆయ‌న పేర్కొన్నారు. అదే విధంగా లోక్ సభ సీట్ల విషయానికి వస్తే వైసీపీకి 21 సీట్లు లభిస్తాయని, టీడీపీకి నాలుగు సీట్లు దక్కే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. ఈ సర్వేను ఫిబ్రవరి 17 నుంచి 21 తేదీల మధ్య, అలాగే, మార్చి 27 నుంచి 31వ తేదీల మధ్య రెండు విడతలుగా భారీ శాంపిల్స్ తో చేసినట్లుగా పేర్కొన్నారు. 


ఫిబ్రవరిలో సర్వే చేసినపుడు టీడీపీ వైసీపీల మధ్య ఓట్ల తేడా 4.5 శాతం ఉంటే, మార్చిలో సర్వే చేసినపుడు ఆ తేడా 8 శాతానికి పెరిగింది. తాజా అంచనాల ప్రకారం వైసీపీకి 48.1 శాతం ఓట్లు లభిస్తే టీడీపీకి 40 శాతం ఒటు షేర్ వస్తుందని కూడా సర్వే వెల్లడించింది.ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ గాజువాకలో అతి కష్టం మీద గెలుస్తారని, భీమవరంలో మాత్రం గెలుపు అవకాశాలు లేవని ఈ సర్వే తేల్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: