చంద్రబాబుకి కుప్పం...జగన్‌కి పులివెందుల కంచుకోటలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తొలిసారిగా పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌కి భీమవరం, గాజువాకలలో ఏ నియోజకవర్గం కంచుకోటగా మారుతుందో చూడాలి. అయితే భీమవరంలో పవన్ గెలుపు అంత సులువు కాదని...గాజువాకలో అయితేనే సులువుగా గెలుస్తారని ప్రజల్లో పెద్ద చర్చే నడుస్తోంది. భీమవరం గురించి పక్కనబెడితే.. గాజువాకలో జనసేనకి ఎక్కువ బలం ఉందని అర్ధమవుతుంది. రాష్ట్రంలోనే ఆ పార్టీ సభ్యత్వ నమోదులో గాజువాకే మొదటిస్థానంలో ఉంది. అలా అని చెప్పి ఇక్కడ టీడీపీ-వైసీపీలు ఏమి తక్కువగా లేవు...బలమైన అభ్యర్ధులు...బలమైన కేడర్‌తో  పవన్‌తో ఢీ అంటే ఢీ అంటున్నాయి.


గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన పల్లా శ్రీనివాసరావు మరోసారి పోటీలోకి దిగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలుతోనే పల్లా ప్రజల్లోకి వెళుతున్నారు.  గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 92 శాతం పూర్తిచేశానని ఆయన చెప్పుకొస్తున్నారు. ఇక వీటితో పాటు టీడీపీ మేనిఫెస్టో అంశాలు కూడా పల్లాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రజల్లో పల్లాపై వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉంది. నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అటు స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కరించకపోవడంతో..వారు పల్లాపై గుర్రుగా ఉన్నారు. ఇవే ఇప్పుడు పల్లాకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.


అటు తొలిసారి ఇండిపెండెంట్‌గా, రెండోసారి వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డి...మరోసారి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి ఈ ఐదేళ్లు ప్రజల మధ్యలోనే ఉన్నారు. అలాగే పార్టీ కార్యక్రమాల ద్వారా కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ...పార్టీని బలోపేతం చేశారు. వైసీపీ నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక జగన్ పాదయాత్ర తర్వాత గాజువాకలో పార్టీ మరింత బలం పుంజుకుంది. అయితే పవన్ పోటీలో ఉండటం వైసీపీకి పెద్ద మైనస్. ఇక్క‌డ ఆ ఫ్యామిలీపై మంచి క్రేజ్ ఉంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతి కూడా ఆయ‌న‌కు క‌లిసి రానుంది.


అసలు గాజువాకలో పవన్ పోటీ వెనుక కారణం..ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉండటమే.  పైగా ఇక్కడ యువ ఓటర్లు పార్టీ వైపే ఉండడం, సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ ఉండడంతో గెలుపు సునాయాసమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పైగా ఇక్కడ మెగాస్టార్‌ చిరు, పవన్, రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్లు బలంగా ఉన్నాయి. ఇక 2009లో గాజువాక అసెంబ్లీ స్థానానికి ప్రజారాజ్యం తరపున పదివేల ఓట్ల మెజార్టీతో చింతలపూడి వెంకట్రామయ్య గెలుపొందారు. అలాగే పవన్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తమ సమస్యలపై పోరాడతారనే భావన ప్రజల్లో ఉంది. 64 విషయాల్లో గాజువాక అభివృద్ధి చేస్తానని పవన్ ఓ ప్రణాళికని విడుదల చేయడం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఇవే పవన్ గెలుపుకి కారణం అవుతాయని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.


ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లదే హవా....వీరే అభ్యర్ధుల గెలుపుని డిసైడ్ చేస్తారు. వీరి తర్వాత యాదవ, వెలమ సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. కాపులు ఎక్కువ శాతం పవన్ వైపే ఉంటారనేది సుస్పష్టం. యాదవ, వెలమతో పాటు మిగిలిన వర్గాల మద్దతు మూడు పార్టీలకి ఉంటుంది. గాజువాక‌తో పాటు భీమ‌వ‌రంలో పోటీ చేస్తోన్న ప‌వ‌న్‌కు అక్క‌డ ఓట‌మి త‌ప్ప‌ద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. ఇక్క‌డ ఎడ్జ్ ఉంటుంద‌న్న అంచ‌నాలు ఉన్నా ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాల బట్టి ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా లేకపోలేదు. చూద్దాం మరి పవన్‌కు గెలుపు సొంతం అవుతుందా ? టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు ఏ మేర పోరాడుతారో.



మరింత సమాచారం తెలుసుకోండి: