16 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపే ల‌క్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్ర‌మంలో బ‌హిరంగ స‌భ‌ల ద్వారా ప్ర‌చారం సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి తాజాగా జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మ‌రోమారు దేశ రాజ‌కీయాల గురించి కేసీఆర్ ప్ర‌స్తావించారు. దేశంలో ఏ నాయకుడు రైతుల గురించి పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అనుకున్న స్థాయిలో దేశం బాగుపడటం లేదు. ఈ దేశంలో మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలె. కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు నిందించుకుంటున్నారు. ఒకరు చోర్ అంటే ఇంకొకరు బడా చోర్ అంటరు. నరేంద్రమోదీపై కూడా ప్రజలకు చాలా ఆశ ఉండే. కానీ ఆయన కూడా అట్టర్ ప్లాపయిండు. గత ఐదేళ్లు సంపూర్ణమైన మెజార్టీతో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 


ఎన్నికలు అనగానే ఆగమాగం కావొద్దని కేసీఆర్ సూచించారు. ``15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఎన్నికలు చాలా వస్తయి..చాలా మందిని గెలిపించా. ఏం జరిగితే రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుందో మీమీ ఊరిలో చర్చ చేయాలి. ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడెలా ఉందో చర్చ చేయాలి. ఎవరు ఏం చెప్పినా విని మంచి ఆలోచన చేయాలి. కరెంట్ కోసం చాలా బాధలు పడ్డం. ఆనాడు కరెంట్ కష్టాలు ఎలా ఉండేవి. ఇపుడెలా ఉన్నాయి..దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మిషన్ భగీరథ పూర్తి కావొస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాకపోతే..టీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోయి ఉంటే రైతు బంధు, రైతు బీమా ఉండేవి కావన్నారు. రైతు బంధు కింద ఇక నుంచి ఏడాదికి రూ.10వేలు ఇస్తామన్నారు. చిన్నాపెద్దా అని తేడా లేకుండా రైతు బీమా అమలు చేస్తున్నం`` అని కేసీఆర్ వివ‌రించారు. 


అసెంబ్లీ ఎన్నికల్లో పంపూర్ణ మెజార్టీతో గెలిపించి..అధికారమిచ్చారని సీఎం పేర్కొన్నారు. మాకు తెలంగాణ ప్రజలే బాసులు. వాళ్ల అవసరాలే మా ఎజెండా అని సీఎం కేసీఆర్ అన్నారు. ``జ‌హీరాబాద్ నిమ్జ్ పూర్తయితే 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నిమ్జ్ పూర్తయితే జహీరాబాద్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతది. జహీరాబాద్ నియోజకవర్గంలో 7లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి`` అని సీఎం తెలిపారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్తి బీబీ పాటిల్‌ను పెద్ద ఎత్తున ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: