తెలంగాణా సీఎం కేసీఅర్ మాటలు చాలా కాంఫిడెంట్ గా ఉంటాయి. ఆయన లెక్క పక్కాగా ఉంటుంది. ఏదైనా చెప్పారంటే చేసి తీరుతారన్న‌ నమ్మకమూ జనంలో ఉంది. అసాధ్యాలను సుసాధ్యం చేయగల సాహసిగా ఆయనకు తెలంగాణలో పేరు. అటువంటి కేసీయార్ డిల్లీ కోటను బద్దలు కొట్టలేమా అని అంటే సై అంటారు జనం.


కేసీయార్ గత కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల గురించే మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన ఈ రోజు వరంగల్ జిల్లా నరసంపేట ఎన్నికల సభలో మాట్లాడుతూ సంచలన వ్యాఖలు చేశారు. తెలంగాణాలో పదహారుకు పదహారూ సీట్లు గెలిస్తే మనమెందుకు ప్రధాని కాకూడదూ అంటూ జనం ముందు భారీ  ప్రకటన చేశారు. తెలంగాణా నుంచి మొత్తం సీట్లు మనం గెలిస్తే డిల్లీ కాళ్ళ కిందకు రాదా అంటూ మొదలెట్టిన కేసీయార్ మనమే దేశాన్ని ఎందుకు పాలించకూడదూ అంటూ ఏకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టి సవాలే విసిరారు.


మోడీ, రాహుల్ వీళ్ళేనా దేశాన్ని  ఏలేది, మనం కాకూడదా అంటూ కేసీయార్ లాజిక్ గా మాట్లాడుతూంటే నిజమే కదా అనుకోవడం తెలంగాణా ప్రజల వంతు అయింది. మోడీ దేశానికి అయిదేళ్ళ పాలనలో ఏం చేశారని కూడా కేసీయార్ గట్టిగా నిలదీశారు. రాహుల్ వారసత్వ జమానా చెల్లదని తేల్చిచెప్పారు. వచ్చేది నూటికి నూరు శాతం ఫెడరల్ ఫ్రంటేనని కూడా అయన గట్టిగా చెప్పారు. కేసీయార్ మాటలను చూస్తే ఏమో నిజమే కావచ్చేమో అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: