దేశానికి ఓ చాయ్ వాలా, చౌకీదార్ ప్రధానమంత్రి అయ్యారని, ఇప్పుడు ఓ పోరాటయోధురాలు ప్రధాని కాబోతున్నారని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోస్యం చెప్పారు. మాయావ‌తితో క‌లిసి నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. "భార‌తీయ జ‌నతా పార్టీ , కాంగ్రెస్ పార్టీల తర్వాత ఏకైక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీయే. బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధినేత్రి మాయావ‌తి  మార్గనిర్దేశం కోరుకుంటున్నాం. మాట ఇస్తే నిల‌బ‌డే త‌త్వం, పాల‌న అనుభ‌వ‌మే ఆమె వెంట న‌డిచేలా చేసింది. బీఎస్పీతో కలిసి పని చేయాలని 2008 నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే అప్పటి పరిస్థితుల నేపథ్యంలో కలిసి ముందుకు వెళ్లలేకపోయాము. అయితే బీఎస్పీ మేధావులు, దళిత నేతలతో నా సాన్నిహిత్యం ఇప్ప‌టికీ కొనసాగుతుంది. 2014లో అప్పటి పరిస్థితులను అనుసరించి బీజేపీ, టీడీపీలతో కలిసి పని చేశాం. సన్నిహితులు, మేధావులు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు బీఎస్పీతో కలవాలని కోరారు. వాళ్ల సూచ‌న మేర‌కు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నికల్లో బీఎస్పీతో క‌లిసి పోటీ చేస్తున్నాం.`` అని వివ‌రించారు.


దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించారని అయితే, ఆ హామీ నెరవేరలేదని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఏ కార‌ణాల‌తో ఆ హామీ నెర‌వేర్చ‌లేక‌పోయారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ``దళితుడిని సీఎం చేయకపోయినా ప్రధానిని చేసే అవకాశం ఉంది. ఈ దేశానికి బెహన్ జీ మాయావ‌తిని ప్రధానిగా చూడాల‌న్న‌ది నా ఆకాంక్ష. దేశానికి ఓ చాయ్ వాలా, చౌకీదార్ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు ఓ పోరాటయోధురాలు ప్రధాని కాబోతున్నారు. ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆమె ఈ స్థాయికి చేరారని.. ఆమె సూచనలు, సలహాలు కోరుకుంటున్నాం`` అని అన్నారు. 

ప్ర‌త్యేక‌ హోదా విష‌యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా వంచించాయని ప‌వ‌న్ ఆరోపించారు. ``ప్ర‌ధాని మోడీ 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ఇస్తామ‌ని చెప్పి మోసం చేశారు. అధికారం అనుభ‌వించిన రెండు జాతీయ పార్టీలు కూడా వారికి న‌చ్చిన వ్య‌క్తులు, న‌చ్చిన ప్రాంతాల‌కు మాత్ర‌మే న్యాయం చేశాయి. మాయావ‌తిని న‌మ్మ‌డానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం 2007లో ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్ర బ‌డ్జెట్ రూ. 45వేల కోట్లు ఉంటే దానిని రూ. 3 ల‌క్ష‌ల కోట్ల‌కు తీసుకెళ్లారు. బ్రిటిష్ వారి భ‌వంతులు చూపించి మ‌న చరిత్ర అని చెప్పుకుంటున్నాం. కానీ మాయ‌వ‌తి గారు మ‌న‌దైన చ‌ర్రిత‌ను యూపీలో చూపించారు. లా అండ్ అర్డ‌ర్ బలంగా అమ‌లు చేయ‌డంతోపాటు చ‌ట్టాల‌కు ఎవ‌రూ అతీతులు కాద‌ని త‌ప్పు చేసిన త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను సైతం శిక్షించారు. ఆమె పాల‌న అనుభ‌వం, నోయిడాను అభివృద్ధి చేసిన విధానం అమోఘం. మాట‌లు చెప్ప‌డం కంటే ఆమె చేత‌ల్లో చేసి చూపిస్తారు. ప్ర‌ధాన‌మంత్రి కాగానే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈత‌రం నాయ‌కులైన తనతో పాటు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లాంటి వారికి ఆమె ఒక స్ఫూర్తి. ప్రాంతీయ పార్టీలను అర్థంచేసుకోలేని స్థితిలో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి బీఎస్పీ అవసరం చాలా ఉంది`` అని ప‌వ‌న్ అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: