గ‌త కొద్దికాలంగా జాతీయ రాజ‌కీయాల‌పై స్పందిస్తున్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు అదే త‌ర‌హాలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో త‌న కొత్త ఎజెండా గురించి తెలియ‌జేస్తున్న గులాబీ ద‌ళ‌ప‌తి త‌న టార్గెట్ గురించి మ‌రోమారు వివ‌రించారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ....కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీపై ప్ర‌శంస‌లు గుప్పించారు. ఆ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. 


రాజకీయంగా, పరిపాలనా పరంగా మోడీ అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కంటే సోనియా గాంధీ చాలా పరిపక్వతతో ఆలోచిస్తారని కేసీఆర్ ప్ర‌శంసించారు. రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్నారని ఆయ‌న పేర్కొన్నారు. ``మొదటి కాంగ్రెస్సేతర పరిపూర్ణ ప్రభుత్వంగా మోడీకి దేశప్రజలు సువర్ణ అవకాశం ఇచ్చారు. కానీ, దేశ ప్రజలు ఆయనపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఆయన వమ్ము చేశారు.`` అని వ్యాఖ్యానించారు. ``దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ నాశనం పట్టించాయి. మేం దేశానికి ఓ ఎజెండాను నిర్దేశిస్తున్నాం. దేశానికి ఆర్థిక, పరిపాలనా పరమైన సంస్కరణలు ప్రతిపాదిస్తున్నాం. మా దేశం ప్రపంచంలో గొప్పగా ఉండాలి. మేం గర్వంగా చెప్పుకునే పరిపాలన సాగాలని కోరుకుంటున్నాం`` అని తెలిపారు. 


త‌న‌కు ప్రధాని కావాలని కోరిక లేదని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఎవరో ప్రధాని కావాలని తాము పనిచేయడం లేదన్నారు. ``మేం జాతీయ పార్టీలను సమర్థించం. జాతీయ పార్టీలే తప్పనిసరై ప్రాంతీయ పార్టీలకు మద్దతిచ్చే పరిస్థితి సృష్టించడమే మా లక్ష్యం. ప్రాంతీయంగా బలంగా ఉన్న పార్టీలతో మా భేటీలో ఒక్కటే చెప్పాం, మీరు సొంతంగా ఎన్నికలకు వెళ్లండి. మనం గెలిచి నిర్దేశించే స్థితిలో ఉంటే, మేమే మద్దతిస్తామని జాతీయ పార్టీలే మన వద్దకు వస్తాయని వివరించాను.`` అని వివ‌రించారు. 


చంద్రబాబు నాయుడు తన కుట్ర బుద్ది మార్చుకోలేదని కేసీఆర్ ఆరోపించారు. ``ఇతర నేతలకంటే తనను ఎక్కువగా ఊహించుకోవడం బొక్కబోర్లాపడం చంద్ర‌బాబుకు అలవాటు.`` అని ఎద్దేవా చేశారు. ``మమతా బెనర్జీ బయటికి కరకుగా కనిపిస్తారు కానీ, చాలా సునిశితంగా, బాధ్యతగా వ్యవహరిస్తారు. నితీష్ కుమార్ కు ఆ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అండగా ఉన్నారు`` అని తెలిపారు. ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి ఫెడరల్ ఫ్రంట్ గా తాము నిర్దేశిస్తున్న ఎజెండా, ఈ దేశానికి ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైన అంశమ‌న్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: