కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్కసారే గెలిచిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది విజయవాడ పశ్చిమ. 1983లో ఒక్కసారే టీడీపీ అభ్యర్ధి గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. అయితే గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ సీటుని బీజేపీకి కేటాయించింది. కానీ వైసీపీ నుంచి పోటీ చేసిన జలీల్ ఖాన్ విజయం సాధించారు. ఆ తర్వాత జలీల్ టీడీపీలోకి వచ్చేశారు. ఈ ఎన్నికలకి వచ్చేసరికి టీడీపీ తరుపున జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతున్ పోటీ చేస్తుండగా...వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జనసేన నుంచి పోతిన వెంకట మహేశ్ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మూడు పార్టీలు బలంగానే ఉన్నాయి. దీంతో త్రిముఖ పోరు జరగడం ఖాయమైంది. 2009లో ఇక్క‌డ నుంచి ప్ర‌జారాజ్యం గెల‌వ‌డంతో ఇప్పుడు జ‌న‌సేన సైతం ఇక్క‌డ స‌త్తా చాటే ఛాన్స్ ఉంది. 


జలీల్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఉన్న ముస్లిం జనాభాని టీడీపీ ప్రభుత్వం అన్నీ రకాలుగా ఆదుకుంది. సంక్షేమ పథకాలు అందరికీ అందాయి. ఈ నియోజకవర్గంపై పట్టున్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు షబానాకి పూర్తి మద్ధతు ఇస్తున్నారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లడంతో జలీల్‌పై కొంత వ్యతిరేకత వచ్చింది. అలాగే ఇక్కడ తాగు నీరు సమస్య కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు. దీని పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ ప్రభావం షబానాపై ఏ మేర పడుతుందో చూడాలి.


ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వెల్లంపల్లి.. 2009లో ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఈ నియోజకవర్గంపై కొంత పట్టుంది. వైసీపీకి కూడా కేడర్ బాగానే ఉంది. ఎప్పటి నుంచో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న వెల్లంపల్లి...ప్రజల మధ్యలోనే ఉన్నారు. అయితే జనసేన కూడా పోటీలో ఉండటం వలన వైసీపీకి ఇబ్బంది అయ్యే పరిస్తితి ఉంది. జనసేన అభ్యర్ధి పోతిన మహేశ్‌కి నియోజకవర్గంలో కొంత ఫాలోయింగ్ ఉంది. పవన్ అభిమానులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నారు. కానీ టీడీపీ-వైసీపీలకి ఉన్నంత బలం జనసేనకి లేదనే చెప్పాలి.


ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ. ఆ తర్వాత మైనార్టీలు అధికంగా ఉన్నారు. బీసీల్లోనూ నగరాల ప్రాబల్యం ఈ నియోజకవర్గంలో అధికం. కాపులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే బీసీలు, ముస్లింలే అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. టీడీపీ అభ్యర్ధి ముస్లిం కావడంతో ఎక్కువ ముస్లింలు అటు వైపే చూడొచ్చు. మొత్తం మీద ఇక్కడ త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ ఈ ఎన్నిక‌ల్లో అయినా రెండోసారి గెలుస్తుందా ? అంటే గ్యారెంటీ లేని ప‌రిస్థితి. మ‌రి తుది ఫ‌లితం ఎలా ఉంటుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: