ఏపీలో సాధారణ ఎన్నికల వేళ‌ అధికార టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికార టీడీపీ నుంచి వరుస పెట్టి పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా గట్టిగా వారం రోజుల టైమ్‌ కూడా లేదు. ఈ టైమ్‌లో కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి పలువురు కీలక నేతలు క్యూ కడుతుండడాన్ని బట్టీ చూస్తే రాష్ట్రంలో వైసీపీ వేవ్‌ ఏ రేంజులో ఉందో తెలుస్తోంది. ఓ వైపు సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖుల జగన్‌ సమక్షంలో ఫ్యాన్‌ గూటికి చేరిపోతున్నారు. తాజాగా ఇప్పుడు ఏపీలోనే కీలక జిల్లాల్లో ఒకటి అయిన తూర్పుగోదావరి జిల్లా నుంచి సీనియర్‌ రాజకీయ నేత, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్‌ ఫ్యాన్‌ గూటికి చేరారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో హర్ష కుమార్‌తో పాటు ఆయన కుమారుడు శ్రీహర్ష వైసీపీలో చేరారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అండదండలతో 2004, 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించిన హర్ష కుమార్‌ గత ఎన్నికల్లో సైతం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 


ఆ ఎన్నికల్లోనే ఆయన కుమారుడు శ్రీహర్ష పి. గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఇక హర్ష కుమార్‌ కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన చంద్రబాబుకు పాదాభివందనం చెయ్యడంతో ఆయన సొంత సామాజికవర్గం నుంచే ఆయనపై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అయ్యింది. ఎంతో సీనియర్‌ అయ్యి, ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హర్ష కుమార్‌ చంద్రబాబుకు పాదాభివందనం చెయ్యడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. కేవలం అమలాపురం ఎంపీ సీటు కోసమే ఆయన చంద్రబాబు పాదాలకు నమస్కరించినట్లు విమర్శలు సైతం వచ్చాయి. హర్ష కుమార్‌ సైతం తన సీనియార్టీని గౌరవించి చంద్రబాబు తనకు ఎంపీ సీటు ఇస్తారని భావించారు. అయితే చంద్రబాబు హర్ష కుమార్‌ ఆశలపై నీళ్లు చల్లారు. అమలాపురం ఎంపీ సీటును దివంగత మాజీ లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ. బాలయోగి తనయుడు హరీష్‌కు ఇచ్చారు. 


అలాగే కోనసీమలో ఉన్న మూడు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో ఎదో ఒక అసెంబ్లీ సీటును అయినా తన తనయుడికి ఇస్తారని హర్ష కుమార్‌ ఆశలు పెట్టుకోగా అవి కూడా నెరవేరలేదు. చివరకు పార్టీ తరపున, ప్రచార పరంగా ఏవైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారని చూసినా ఆయన్ను టీడీపీ పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు అవమానించింది. దీంతో చంద్రబాబుకు సరైన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న హర్ష కుమార్‌ తాజాగా జగన్‌ సమక్షంలో తన కుమారుడు శ్రీహర్షతో పాటు వైసీపీలో చేరిపోయారు.

పార్టీలో చేరిన ఆయన అమలాపురం లోక్‌సభ సీటుతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కోనసీమలో గట్టి పట్టు ఉన్న హర్ష కుమార్‌ ఎన్నికలకు ఐదారు రోజులకు ముందు టీడీపీకి షాక్‌ ఇచ్చి వైసీపీలో చేరడం టీడీపీ శ్రేణులను నివ్విరపోయేలా చేసింది. ఈ ఎఫెక్ట్‌ అమలాపురం లోక్‌సభ సీటుతో పాటు కోనసీమలో రిజర్వ్‌డ్‌ సెగ్మెంట్లలో బలంగా ఉంటుందని ఎన్నికల్లో టీడీపీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థి అవుతార‌ని అంద‌రు అనుకున్న ఈ సీనియ‌ర్ నేత ఇప్పుడు వైసీపీలోకి జంప్ చేయ‌డంతో కోన‌సీమ‌లో టీడీపీకి సెగ‌లు త‌ప్పేట్లు లేవు.



మరింత సమాచారం తెలుసుకోండి: