శ్రీకాకుళం ఎంపీ స్థానంలో ఈ సారి పోరు ర‌స‌వ‌త్తరంగా మారింది. ఇక్క‌డ నుంచి అన్ని పార్టీలు బ‌రిలో నిల‌వ‌గా పోటీ మాత్రం వైసీపీ-టీడీపీల మ‌ధ్యే ప్ర‌ధానంగా సాగ‌నుంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కింజ‌రాపు రాంమోహ‌న్‌నాయుడు..వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ బ‌రిలో ఉన్నారు. ఇక జ‌న‌సేన నుంచి మెట్ట రామారావు, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, డీసీసీబీ చైర్మ‌న్ డోలా జ‌గ‌న్‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన పేర్ల సాంబ‌మూర్తి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం వ‌ర‌కు కూడా ఇక్క‌డ కాంగ్రెస్ హ‌వానే కొన‌సాగింది. టీడీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ జోర‌కు క‌ళ్లెం ప‌డింది. అంత‌కు ముందు బొడ్డేప‌ల్లి రాజ‌గోపాల‌రావు ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నిక‌వ‌డం గ‌మ‌నార్హం. మ‌ధ్య‌లో గౌతు ల‌చ్చ‌న్న ఒక‌సారి ఆ త‌ర్వాత విశ్వ‌నాథ్ రెండుసార్లు..ఆ త‌ర్వాత 1996నుంచి 2004వ‌ర‌కు జ‌రిగిన నాలుగు ఎన్నిక‌ల్లోనూ ఎర్రంనాయుడు విజ‌యం సాధించారు. ఇక గుంటూరులో ఎంపీగా ఓడిపోయిన ఆచార్య ఎన్జీ రంగా కోసం త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించి ఆయ‌న్ను ఇక్క‌డ నిల‌బెట్టి గెలిపించిన ఘ‌న‌త కూడా గౌతు లచ్చ‌న్న‌కే ద‌క్కుతుంది.


2009లో కిల్లి కృపారాణి విజయం సాధించి కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఎర్రంనాయుడు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న కుమారుడు రాంమోహ‌న్‌నాయుడు 2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో రాంమోహ‌న్ నాయుడు 1.27 వేల ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ అభ్య‌ర్థి రెడ్డి శాంతిపై గెలిచారు. సిట్టింగ్ ఎంపీగా ఇప్పుడు మ‌ళ్లీ పోటీ చేస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌కు ఒక‌ప్ప‌టి కంచుకోట‌గా....గ‌డుస్తున్న కాలంలో టీడీపీకి పెట్ట‌ని కోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ జెండా ఎగుర‌వేయాల‌ని వైసీపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. గ‌తంలో కాంగ్రెస్‌లో ప‌నిచేసిన వారంతా ఈసారి వైసీపీలో చేరార‌ని అదే త‌మ‌కు కొండంత బ‌లాన్ని తెచ్చిపెట్టింద‌ని ఆ పార్టీ శ్రేణులు ధీమాగా చెబుతున్నారు. అదే స‌మ‌యంలో యువ‌నాయ‌క‌త్వంతో పార్టీ, నియోజ‌క‌వ‌ర్గం ఎంతో అభివృద్ధి చెందింద‌ని ఆ పార్టీ శ్రేణులు భ‌రోసాతో ఉన్నారు.


వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన రాంమోహ‌న్‌నాయుడికి..కాళింగ సామాజిక వ‌ర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ ఇద్ద‌రు బ‌లంగానే క‌నిపిస్తున్నారు. అయితే ఎంపీ ప‌రిధిలో కాళింగ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లే ఎక్కువుగా ఉన్నారు. పైగా వైసీపీ ఆముదాల‌వ‌ల‌స‌, ఇచ్ఛాపురం, టెక్క‌లిలో కాళింగుల‌కు సీట్లు ఇవ్వ‌డంతో ఆ వ‌ర్గం ఓట‌ర్ల‌లో ఈ సారి కొంత వ‌ర‌కు మార్పు వ‌చ్చింది. అలాగే నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువుగా ఉన్న మ‌త్స్య‌కారుల‌కు సైతం వైసీపీ ప‌లాస సీటు ఇచ్చింది. టీడీపీ ఈ ఈక్వేష‌న్లు మిస్ అయ్యింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తున్నాడు. త‌న సొంత సామాజిక‌వ‌ర్గ‌మైన కాళింగ‌ల‌తో పాటు మిగిలిన జ‌నాల్లో ఆయ‌న‌పై సానుభూతి ఉంది. ఇది క‌లిసి వ‌స్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అలాగే టీడీపీలోని కొన్ని అసంతృప్తి గ‌ళాలు వైసీపీకి కొంత క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న వాద‌నైతే బ‌లంగా ఉంది. 


రామ్మోహ‌న్‌నాయుడు ప‌లు అంశాల్లో లోక్‌స‌భ‌లో త‌న వాణిని బ‌లంగా వినిపించి ప్ర‌శంస‌లు అందుకున్నారు. అయితే ఓ ఎంపీగా ఆయన నియోజ‌క‌వ‌ర్గానికి అనుకున్న స్థాయిలో నిధులు రాబ‌ట్ట‌లేక‌పోయార‌న్న వాద‌న కూడా ఉంది. రామ్మోహ‌న్‌నాయుడుకు మంచి ఇమేజ్ ఉన్నా ఈ సారి దువ్వాడ శ్రీనివాస్ సెంటిమెంట్ ముందు ఇది ఎంత వర‌కు నిల‌బ‌డుతుందో ?  చూడాలి. ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా రెండు పార్టీలు స‌మఉజ్జీలుగా క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల గెలుపుపైనే ఎంపీ అభ్య‌ర్థుల విజ‌యావ‌కాశాలు మెండుగా ఉంటాయి. దీంతో వారి గెలుపున‌కు వీరు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాల్సి వ‌స్తోంది. ఇక జ‌న‌సేన, బీజేపీ, కాంగ్రెస్‌ల ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌క‌పోవచ్చు. మూడు పార్టీలు ఓట్లు చీల్చి విజ‌య‌వ‌కాశాల‌ను మార్చ‌గ‌లిగే స్థితిలో మాత్రం ఉండ‌టం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: