విశాఖ రూరల్ జిల్లా అనకాపల్లిలో రాజకీయం ఈసారి మారుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి మొత్తం ఓట్లేసిన రూరల్ జిల్లా ఈసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోందంటున్నారు. టీడీపీలో ఈసారి సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంతో అసమ్మతి రాజుకుంది. అదే సమయంలో వైసీపీకి రూరల్ జిల్లాలో గాలి అనుకూలంగా ఉంది. దానికి తగినట్లుగా ధీటైన అభ్యర్ధులను వైసీపీ ఎంపిక చేసింది. దీంతో సైకిల్ స్పీడ్ కి బ్రేకులు పడుతున్నాయి. 


అనకాపల్లి ఎంపీ సీటు విషయానికి వస్తే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్ కి టికెట్ ఇచ్చారు. గత నలభయ్యేళ్ళుగా జిల్లా రాజకీయాలను పరోక్షంగా శాసించిన ఆడారి కుటుంబం ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లైంది. అయితే ఆయనకు ఇపుడు విజయావకాశాలు ఎమ్మెల్యే అభ్యర్ధులను బట్టే ఆధాపడి ఉన్నాయి.అనకాపల్లి ఎంపీ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లతో చూసుకుంటే అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పెందుర్తి, పాయకరావుపేట, నర్శీపట్నంలలో వైసీపీ అభ్యర్ధులు పై చేయి సాధించే పరిస్థితి కనిపిస్తోంది. 


ఇక ఎలమంచిలిలో మాత్రమే టీడీపీకి ఆధిక్యత కనిపిస్తోంది. దీంతో ఎమ్మెల్యే అభ్యధులు ఎదురీదుతున్న వేళ ఆ ప్రభావం కచ్చితంగా ఎంపీ అభ్యర్ధి మీద పడుతోంది. దీంతో ఆనంద్ గెలుపు కోసం గట్టిగా శ్రమించాల్సివస్తోందని అంటున్నారు. ఇక విశాఖ డైరీ వల్ల పాల రైతులు ఓట్లు గుత్తమొత్తంగా తమ ఖాతాలో పడుతాయని ఆనంద్ వూహించారు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని కూడా అంచనా వేసుకున్నారు. అయితే పాల రైతుల్లో ఉన్న అసంత్రుప్తి కూడా ఇపుడు మెల్లగా బయటపడుతోంది.


అదే విధంగా వైసీపీకి ఉన్న సానుకూల పరిస్థితి వల్ల టీడీపీకి ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. వైసీపీ అభ్యర్ధి డాక్టర్ కె సత్యవతి  కూడా సామాజిక సేవా కార్యకర్తగా, వైద్యురాలిగా పరిచయం ఉండడం ప్లస్ పాయింట్ గా ఉంటే తొలిసారి ఎంపీగా రంగ ప్రవేశం చేసిన ఆనంద్ జనాలకు తెలియకపోవడం కూడా పసుపు పార్టీకి కొంత నష్టం తేస్తోందని అంటున్నారు. పోలింగ్ లోగా రిపేర్లు చేసుకోకపోతే సైకిల్ స్పీడందుకోవడం కష్టమేనని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: