రాష్ట్ర రాజకీయాలకి రాజధానిగా ఉన్న బెజవాడ(విజయవాడ) ఎంపీ సీటు..ఎప్పుడు హాట్ సీటే...అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని...మరోసారి విజయవాడని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక నానికి పోటీగా ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌ని వైసీపీ బరిలో దించింది. వీరికి మేము పోటీ ఇస్తామని చెప్పి జనసేన ముత్తంశెట్టి లక్ష్మణ శివ ప్రసాదబాబుని పోటీ చేయిస్తుంది. వీరితో పాటు కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉన్న... ప్రధాన పోరు టీడీపీ-వైసీపీల మధ్యే జరగనుంది.


ఇక నాని ఎంపీగా ఉన్న ఈ ఐదేళ్లలో విజయవాడలో అభివృద్ధి వేగంగా జరిగింది. ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టె కనకదుర్గ ఫ్లైఓవర్‌, బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌లు దాదాపు పూర్తయ్యే స్థితికి చేరుకున్నాయి. అలాగే టాటా ట్రస్టు సహకారంతో తన లోక్‌సభ స్థానం పరిధిలోని తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల స్థానిక స్థితిగతులను మార్చడానికి పక్కా ప్రణాళికను రూపొందించారు. అటు స్థానికంగా ఉన్న పెద్ద ఆస్పత్రులతో పాటు విజయవాడలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా వైద్యం చేయించుకునే ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. పార్లమెంట్ పరిధిలో 700 అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికంగా తీర్చిదిద్దారు. కేంద్రంతో పొరాడి ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వీటితో పాటు టీడీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బోనస్.


మరోవైపు వైసీపీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన పొట్లూరి వరప్రసాద్‌ స్వస్థలం విజయవాడే. ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగాక విజయవాడలో పీవీపీ మాల్‌ను ఏర్పాటు చేశారు. స్థానికంగా యువ‌త‌కు ఉపాధి క‌ల్పించేలా చేశారు. పీవీపీ విజయవాడ సిటీలో ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టి సారించారు. తనకో అవకాశమిస్తే వినోద రంగంలో విజయవాడను అగ్రగామిగా నిలుపుతానని అంటున్నారు. అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్ధులు కూడా బలంగానే ఉన్నారు. ఇక పీవీపీ ఆర్ధిక పరిస్తితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయనపై ఉన్న మనీలాండరింగ్‌ కేసులు ఉండటం ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు ఇటీవల ప్రత్యేక హోదా బోరింగ్‌ సబ్జెక్టని చేసిన వ్యాఖ్యలు కూడా మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.


ఇక్కడ జనసేనకి గెలిచే అంత సీన్ లేదు గాని...ఓట్లు చీల్చే అవకాశం మాత్రం ఉంది. మరి ఈ ఓట్ల చీలిక ఎవరికి నష్టం కలిగిస్తుందో తెలియాల్సి ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలో విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 చోట్ల టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు హోరాహోరీగా పోరాడనున్నారు. ఈ లోక్‌సభ స్థానంలో బీసీలు, ఎస్సీల ఓట్లు కీలకం, మొత్తం 14.5 లక్షల ఓటర్లలో సగం మంది ఈ వర్గాలే. కమ్మ, కాపు వర్గాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే బీసీ, ఎస్సీలే అభ్యర్ధుల గెలుపోటములని ప్రభావితం చేస్తారు. ఎవ‌రి అంచ‌నాలు ఎలా ఉన్నా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థులు, ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలు బట్టి అభ్యర్ధుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ హాట్ సీటులో టీడీపీకి గ‌తంలో ఉన్న జోరుతో పోలిస్తే కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. ఇటు పీవీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిగా ఉండ‌డంతో పాటు దూకుడుగా ముందుకు వెళుతుండ‌డం ఆ పార్టీకి చాలా పెద్ద ప్ల‌స్ అయ్యింది. మ‌రి తుది ఫ‌లితం ఎలా ఉంటుందో ? ఈ ఉద్దండుల పోరులో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: