హిందూపురంలో బాలకృష్ణ గెలవడం ఇప్పుడు ఇంకా క్లిష్టంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే గెలుపు అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నవి. ఇప్పుడు సాంతం పోయిందని చెప్పాలి. హిందూపురం లోక్ సభ మాజీ సభ్యుడు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు కల్నల్ నిజాముద్దీన్ వైఎస్ఆర్సీపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన హైదరాాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు హిందూపురం అసెంబ్లీ పరిధిలోని పలువురు ముస్లిం నాయకులు పార్టీలో చేరడం వైఎస్ఆర్సీపీలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమనే ధీమా వారిలో నెలకొంది. 


నిజానికి కల్నల్ నిజాముద్దీన్ .. వైసీపీ అభ్యర్ధికి సహకరిస్తే వైసీపీ విజయం నల్లేరు మీద నడక లాంటిందని చాలా మంది చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు పార్టీలో చేరడంతో హిందూపురం వైసీపీలో ఆనందాలు మొదలయ్యాయి. కల్నల్ నిజాముద్దీన్ స్వస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి. గతంలో ఆయన కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగారు. 2004 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హిందూపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై నిజాముద్దీన్ గెలుపొందారు. 2009లో ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.


ముస్లిం సామాజిక వర్గాల ఓటుబ్యాంకును ఆయన ప్రభావితం చేయగలరని వైఎస్ఆర్సీపీ విశ్వసిస్తోంది. వచ్చే ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ముస్లిం సామాజిక వర్గానికే చెందిన మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్ ను బరిలో దింపిన విషయం తెలిసిందే. హిందూపురం అసెంబ్లీ సీటును ముస్లింకు కేటాయించడాన్ని కల్నల్ నిజాముద్దీన్ స్వాగతించారు. ఇక్బాల్ సహా పార్టీ హిందూపురం లోక్ సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ ను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. హిందూపురాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చినప్పటికీ.. ఏ ఒక్క పని కూడా చేయలేదని నిజాముద్దీన్ విమర్శించారు. కనీసం మంచినీటి వసతిని కూడా మెరుగుపర్చలేకపోయారని అన్నారు. ఈ సారి తాము ఇక్బాల్, మాధవ్ లను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: