పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార ఉధృతి పెరిగిపోతోంది.  ప్రచారానికి ఇక ఉన్నది కేవలం ఐదు రోజులు మాత్రమే. 8వ తేదీ సాయంత్రంతో ప్రచార పర్వం ముగుస్తుంది.  ఇటువంటి సమయంలో కొన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్ధులు జగన్మోహన్ రెడ్డి ప్రచారంపైనే ఆధారపడ్డారు. అందులో అనంతపురం జిల్లాలోని హిందుపురం మొదటివరసలో ఉంటుంది. ఇక్కడ వైసిపి నుండి మొహ్మద్ ఇక్బాల్ పోటీ చేస్తుంటే అధికార టిడిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు.

 

తెలుగుదేశంపార్టీకి కంచుకోటలుగా నిలబడుతున్న నియోజకవర్గాల్లో హిందుపురం మొదటిస్ధానంలో ఉంటుంది. అందుకనే జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది.  ఎన్టీయార్ పార్టీ పెట్టిన దగ్గర నుండి హిందుపురం నియోజకవర్గంలో  తెలుగుదేశంపార్టీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అంటే ఏ స్ధాయిలో ఈ నియోజకవర్గ ప్రజలు టిడిపికి మద్దతుగా నిలబడుతున్నారో అర్ధమైపోతోంది.

 

ఈ నియోజకవర్గంలో టిడిపి తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలిచిపోతున్నారు. అంటే అభ్యర్ధి ఎవరు ? అనే విషయం కన్నా పార్టీనే ఇంపార్టెంట్. ఇటువంటి నియోజకవర్గంలో ఎన్టీయార్ కొడుకు బాలకృష్ణ రెండోసారి పోటీ చేస్తున్నారు. అందులోను పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయనటంలో సందేహం లేదు. కాబట్టే వైసిపి అభ్యర్ధి  ఇక్బాల్ ఇక్కడ నానా అవస్తలు పడుతున్నారు.   

నిజానికి టిడిపి ముందు ఇక్బాల్ తేలిపోతారు. ఆర్ధిక, అంగ బలాల్లో ఇక్బాల్ ఎందులోను సరితూగలేరు. ఇక్కడ ఇక్బాల్ గెలవటమంటే మామూలు విషయం కాదు. అందుకే జగన్ కూడా ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. స్దానిక నేతలు నవీన్ నిశ్చల్, అబ్డుల్ ఘనీ లాంటి వాళ్ళ మద్దతుకు తోడు బాలకృష్ణపై జనాలు కూడా వ్యతిరేకత పెంచుకుంటే తప్ప ఇక్కడ వైసిపి గెలవటం సాధ్యం కాదు. ఇక్కడ జనసేన తరపున ఆకుల ఉమేష్ పోటీలో ఉన్నారంటే ఉన్నారంతే.


నిజానికి నియోజకవర్గంలో బాలకృష్ణపై తీవ్రస్ధాయిలో వ్యతిరేకత కనబడుతోంది. ఆ వ్యతిరేకతను ఇక్బాల్ ఎంత మేరకు అనుకూలంగా మలుచుకుంటారన్నదే ప్రశ్న. మామూలు జనాలే కాకుండా పార్టీ నేతలు, క్యాడర్ కూడా బాలకృష్ణకు వ్యతిరేకమైపోయారు. తన వ్యవహారశైలి వల్ల బాలకృష్ణ అందరినీ దూరం చేసుకుంటున్నారు. ఎవరిని పడితే వారిని కొట్టటం, నోటికొచ్చినట్లు తిట్టటం,  నేతలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం లాంటి చేష్టలతో పార్టీని కంపు చేసేశారు. కాబట్టి ఇక్బాల్ ఇక్కడ అందరి మద్దతుతో గట్టిగా పట్టుబడితే గెలుపు అవకాశాలున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: