జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న పార్టీని రెండు రాష్ట్రాల్లో విస్త‌రించాల‌ని ఆకాంక్షిస్తున్న ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. ఆయ‌న పార్టీ తెలంగాణ‌లో అవ‌స‌రం లేద‌ని, అదో ఆంధ్రా పార్టీ అని విజ‌య‌శాంతి ప్ర‌క‌టించారు!. త‌ద్వారా జ‌న‌సేన‌పై కొత్త ముద్ర వేశారు రాముల‌మ్మ‌.


ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి పవన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ, దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అదే సమయంలో ఆంధ్రా పాలకులు వేరు, ఆంధ్రా ప్రజలు వేరు అనే విషయాన్ని గుర్తించాలని.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను నిందించకూడదని పవన్ విజ్ఞప్తి చేశారు. కొందరు తెలంగాణ నాయకులు ఏపీ ప్రజలను నిందించడం తనకు నచ్చలేదన్నారు. పద్ధతి మార్చుకోవాలని పవన్ సూచించారు. తెలంగాణలో దళిత సీఎం కోరిక నెరవేరలేదన్నారు. దోపిడీ వ్యవస్థ ఎక్కడున్నా అరికట్టాల్సిందే అన్నారు. ప్రతిపక్షం లేకుండా పరిపాలన సాగాలంటే ఎలా? అని పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.


అయితే ప‌వ‌న్ కామెంట్ల‌పై రాములమ్మ ఊహించ‌ని రీతిలో రియాక్ట‌య్యారు. ``ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రమేయం వద్దు అని పవన్ చెప్తుంది సమంజసమే. అయితే కారుకు ఫ్యాన్ కడితే ...హెలికాఫ్టర్ వ‌లే ఎగరొచ్చు అనే కేసీఆర్ భ్రమలను మనం మార్చలేము! క్రాష్ ల్యాండ్ అయిన‌ప్పుడు మాత్రమే ఆయ‌నకు తెలిసివ‌స్తుంది. అలాగే తెలంగాణలో జనసేన అవసరం లేదని కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆ పార్టీ గుర్తించాలి.`` అంటూ ప‌వ‌న్ పార్టీపై ఆంధ్రా ముద్ర వేశారు. ఈ కామెంట్ల‌కు జ‌న‌సేన ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: