గుంటూరు జిల్లా నరసారావుపేట పార్లమెంట్‌లో ఈ సారి ఆసక్తికరమైన పోరు జరుగుతుంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు రాజకీయంగా, సామాజిక వర్గ పరంగా, ఆర్థికంగా అత్యంత బలవంతులు కావడంతో పోరు రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి మరోసారి సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు బరిలో ఉండగా...వైసీపీ నుంచి విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ బరిలో ఉండగా...జనసేన నుంచి ముస్లిం అభ్యర్ధి నయూబ్ కమల్ పోటీ చేస్తున్నారు.


ఇక టీడీపీ అభ్యర్ధి రాయపాటి సీనియారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమి లేదు. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా రాజకీయాలు చేస్తూ.. తలపండిన నేతగా గుర్తింపు పొందారు. ఆర్ధికంగా బలంగా ఉన్న రాయపాటికి దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అనుచర వర్గం ఉంది. అటు పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులు బలంగా ఉన్నారు. పైగా తన సొంత సామాజికవర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువ ఉండటం కలిసొచ్చే అంశం. అయితే వైసీపీ అభ్యర్ధి కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేత. ఆర్థిక,అంగబలం ఉండడంతో గెలుపుపై శ్రీకృష్ణదేవరాయలు ధీమాగా ఉన్నారు. ఇక శ్రీకృష్ణ తండ్రి రత్తయ్యకి నియోజకవర్గంలో మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే ఈ పార్లమెంట్ పరిధిలో వైసీపీకి కూడా బలమైన క్యాడర్ ఉంది.


బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కన్నాకి కూడా నరసారావుపేటపై మంచి పట్టుంది. పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో... ఆ సామాజిక వర్గం తన వెంటే నడుస్తుందన్న ధీమాతో కన్నా ఉన్నారు. ఆర్ధికంగా కూడా కన్నా బలంగానే ఉన్నారు. కానీ  విభజన హామీలు, ప్రత్యేకహోదా ప్రభావం కన్నాపై గట్టిగానే ఉంటుంది.  జనసేన నుంచి నయూబ్ నిలవడంతో...ముస్లింల ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అలాగే పవన్ ఇమేజ్, కాపు ఓట్లు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలో కమ్మ ఓటర్లదే ఆధిక్యం. వీరు దాదాపు 2.50 లక్షల వరకు ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీలు కూడా కమ్మ ఓటర్లతో సమానంగా ఉన్నారు. అలాగే రెడ్డి, ముస్లిం, కాపు, బీసీ, వైశ్యులు ప్రభావం కూడా ఎక్కువ ఉంది.


అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు కమ్మ సామాజికవర్గ నేతలు కాగా, కన్నా కాపు, జనసేన అభ్యర్ధి నయూబ్ ముస్లిం. దీని బట్టి ఓట్ల షేరింగ్ ఎలా ఉంటుందో అర్ధమవుతుంది. కానీ బీజేపీ, జనసేన అభ్యర్ధులు ఓట్లు చీలుస్తారు గాని...గెలిచే అంత సత్తా అయితే లేదు. అసలు పోరు మాత్రం రాయపాటి-శ్రీకృష్ణల మధ్యే ఉంటుంది. వీరిద్దరిలోనే ఒకరు విజేతగా నిలిచే అవకాశం ఉంది. ఇక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో టీడీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఉన్నారు. వినుకొండలో జీవి.ఆంజ‌నేయులు, పెద‌కూర‌పాడులో కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్‌, గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, చిల‌క‌లూరిపేట‌లో ప్ర‌త్తిపాటి పుల్లారావు, స‌త్తెన‌ప‌ల్లిలో స్పీక‌ర్ కోడెల సీనియ‌ర్లు కావ‌డం ఆ పార్టీకి క‌లిసి రానుంది. అయితే మాచర్ల‌, న‌ర‌సారావుపేట‌, స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ భారీ ఆధిక్యంపై ఆశ‌లు పెట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: