అభిమానం ఉండాలి కానీ...కీల‌క‌మైన స్థానాల్లో ఉన్న‌పుడు సంయమ‌నం పాటించాలి. అలా పాటించ‌క‌పోతే, ఎలాంటి ఇబ్బందుల్లో ప‌డ‌తారో తెలియ‌జెప్పేందుకు రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ నిద‌ర్శ‌నం. రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్న కల్యాణ్ సింగ్ రాజకీయాలకతీతంగా వ్యవహరించకుండా ప్రధాని మోదీకి మద్దతుగా కామెంట్లు చేశారు. దీంతో ఆయ‌న ప‌ద‌వి ఊడిపోయే ప‌రిస్థితి ఎదురైంది. 


గత మార్చి నెల 23న ఆయన అలీగఢ్‌లోని తన నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మనమంతా బీజేపీ కార్యకర్తలమని అన్నారు. దీంతోపాటుగా బీజేపీ విజయాన్ని కాంక్షించాలని, మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకోవాలని, వరుసగా రెండోసారి మోదీ ప్రధాని కావలసిన అవసరమున్నదన్నారు. ఈ వ్యాఖ్యలతో కల్యాణ్ సింగ్ కోడ్‌ను ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ (ఈసీ) సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కల్యాణ్ సింగ్‌పై తగిన చర్య చేపట్టాలని సిఫారసు చేస్తూ సంబంధిత ఫైల్‌ను రాష్ట్రపతి గురువారం కేంద్రానికి పంపారు. త‌గు చ‌ర్య‌లు తీసుకునే అంశం ప్ర‌స్తుతం ప‌రిశీల‌న‌లో ఉంది.


ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ 1999లో బీజేపీని వీడి 2004లో మళ్లీ అదే పార్టీలో చేరారు. 2014 లో మోదీ కేంద్రంలో అధికార పగ్గాలను చేపట్టిన తర్వాత కల్యాణ్ సింగ్‌ను రాజస్థాన్ గవర్నర్‌గా నియమించారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేసినందుకు కల్యాణ్ సింగ్‌ను గవర్నర్ పదవి నుంచి డిస్మిస్ చేయాలని కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో బుధవారం ఓ పిటిషన్ దాఖలైంది. 1990వ దశకంలో ఎన్నికల సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ గుల్షేర్ అహ్మద్ తన కుమారుని తరఫున ప్రచారం చేయడం పట్ల ఈసీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఇదే నిర్ణ‌యం తాజాగా క‌ళ్యాణ్ సింగ్ విష‌యంలో తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: