ఏపీలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌(సీపీఎస్‌) సర్వే స్పష్టం చేసింది. ఆ పార్టీ ఏకంగా 121 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లలో విజయభేరి మోగించి అధికారంలోకి రానుందని తేల్చిచెప్పింది. వైఎస్సార్‌సీపీ 21 ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించనుందని పేర్కొంది. కాగా, అధికార తెలుగుదేశం పార్టీ కేవలం 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది.

జనసేన పార్టీకి కేవలం ఒకట్రెండు ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చిచెప్పింది. ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు డా.వేణుగోపాలరావు నేతృత్వంలో సీపీఎస్‌ సంస్థ ఎన్నికల సర్వేల నిర్వహణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2009 నుంచి ఆ సంస్థ నిర్వహిస్తున్న సర్వేలన్నీ నిజమవుతూ వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా సీపీఎస్‌ సర్వే ఫలితాలు పూర్తిగా నిజమయ్యాయి.తీవ్ర ఆసక్తి కలిగిస్తున్న ఏపీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉండనుందనే అంశంపై సీపీఎస్‌ సంస్థ రెండు దశల్లో సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు మొదటి దశ సర్వేలో 4,37,642 మంది అభిప్రాయాలను సేకరించింది.

మార్చి 27 నుంచి 31వ తేదీ మధ్య రెండో దశ సర్వేలో 3,04,323 మంది అభిప్రాయాలను సేకరించింది.అంటే మొత్తం 7,41,965 శాంపిల్స్‌ సేకరించి శాస్త్రీయంగా సర్వే నిర్వహించింది. అనంతరమే సర్వే ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రముఖ పాత్రికేయుడు సుధీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ ప్రజల అభిప్రాయాలు, ఇక్కడ ఎన్నికల ఫలితాలపై తమ సర్వే వివరాలను వేణుగోపాలరావు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: