కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అనిల్‌ చంద్ర పునేఠాను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి లంకా వెంకట సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్లు ప్రకటించింది. అనిల్‌ చంద్ర పునేఠాను ఎన్నికలతో సంబంధంలేని పోస్టుకు బదిలీ చేయాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం  రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా పై వేటు వేసి గట్టి షాక్ ఇచ్చింది. 


అనిల్‌ చంద్ర పునేఠా ను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నేడు (శుక్రవారం) ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎల్‌వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా కొనసాగుతారని ఈసీ స్పష్టం చేసింది. ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీని అనిల్‌ చంద్ర పునేఠా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌ చంద్ర పునేఠాను ఈసీ ఢిల్లీకి పిలిపించింది. 

ఐపీఎస్‌ల బదిలీ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మూడు జీవోలపై వివరణ కోరింది. అయితే, ఆయన ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని ఈసీ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలిసింది. 


కొత్తగా  సీఎస్ గా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983 వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ యూత్ సర్వీసెస్ పోస్ట్ లో కొనసాగుతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం.


ముగ్గురు ఐపీఎస్ అధికారుల వేటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్రప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఏకంగా సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసిన నేపథ్యంలో ఎలా స్పందిస్తుందో అన్నది వేచి చూడాలి. ఐపీఎస్ ల బదిలీలపై కోర్టుకు వెళ్లిన రాష్ట్రప్రభుత్వం సీఎస్ బదిలీపై ఎలా రియాక్ట్ అవుతారా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది. 


చంద్రబాబు స్పందన


"ఏం చేస్తారో చేసుకోండి. నేను భయపడను. 40 ఏళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నాను. మోడీ నేరస్తులకు కాపలా కాస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఎన్నికల కమిషన్ పని చేయడం లేదు"  అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఏపీ ప్రధాన కార్యదర్శి పునేఠను ఈసీ బదిలీ వేటు వేసింది. ఈయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను అపాయింట్ చేసింది. విశాఖపట్టణం కంచరపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే ఆయన తొలి స్పందన ఇది


బదిలీలను ఖండించిన బాబు. ఎన్నికల సంఘంపై ఫైర్ అయ్యారు. ఈసీ తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఏం తప్పు చేశారని సీఎస్‌ను మార్చారని ప్రశ్నించారు చంద్రబాబు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పినట్లు ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని పేర్కొన్నారు. 


తెలంగాణలో 25లక్షల మంది ఓట్లను తీసేశారని గుర్తు చేసిన చంద్రబాబు, ఏపీలో 7 లక్షల ప్రజల ఓట్లను తొలగించారన్నారు. ఓట్లను తొలగింపుపై తాము సిట్ వేసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, ఆధారాలు ఇవ్వాలంటే ఈసీ ఎన్నికల అధికారి మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. నరేంద్ర మోడీకి ఊడిగం చేయాలా ? వారి కాళ్లు పట్టుకోవాలా? అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తీవ్రమైన నేరాలున్నాయన్నారు.


ఎన్నికళ వేళ అధికారుల బదిలీలు తీవ్ర ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలు రాహుల్‌ దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఏపీ సీఎస్‌గా ఉన్న పునేఠపై బదిలీ చేసింది. బదిలీల వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల విధులతో సంబంధం లేని వారిని ఏ కారణంతో బదిలీలు చేశారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: