రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి, అధికార పీఠమెక్కిన చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారే తప్ప, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. పాలనలో తనకెంతో అనుభవం ఉందని నమ్మబలికిన బాబు గత ఐదేళ్లుగా సీఎం సహా ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీ సభ్యులు యథేచ్ఛగా దోపిడీ సాగించారన్నారు. ప్రజల సొమ్మును దోచుకుని ఆ సొమ్ములో కొంతభాగం ఖర్చుచేసి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బూటకపు వాగ్దానాలు, కల్లబొల్లి కబుర్లు చెబుతున్న చంద్రబాబు కుయుక్తులను ప్రజలు గమనించాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన కోట్లాది రూపాయల్లో సింహభాగం దిగమింగిన బాబు, ఆ సొమ్ములోని కొంత భాగాన్ని తన సొంత పథకాలకు వినియోగించుకుని, తానేదో రాష్ట్ర ప్రజలకు మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్రం నిధులను వాడుకున్న చంద్రబాబు నేడు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ నిధులను మంజూరు చేసిన ప్రధాని మోదీపై అసత్య ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనాన్ని చాటుతోందన్నారు.

చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, వేర్పాటువాది ఫరూక్‌ అబ్దుల్లాకు ఓటేసినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  2017 సంవత్సరంలో జరిగిన ఓ అసెంబ్లీ సమావేశంలో మోదీపై బాబు ప్రశంసలు కురిపించారని.. మోదీలాంటి అవినీతి రహిత ప్రధానిని తాను చూడలేదని చంద్రబాబు స్వయంగా ప్రకటించారని కన్నా గుర్తుచేశారు. రాజకీయ లబ్ది కోసమే ఇప్పుడు బాబు నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన విమర్శలు కురిపించారు.

అభివృద్ధి మాట మరిచి దోచుకున్న చంద్రబాబు వేర్పాటువాద శక్తులతో దోస్తీకట్టి ప్రజలను ఏమార్చేందుకు కేంద్రప్రభుత్వంపై కువిమర్శలు చేయడాన్ని ప్రజలను గమనించి, ప్రతిఘటించాలన్నారు. చేసిన అభివృద్ధిని వివరించి ఓట్లు అభ్యర్థించాల్సింది పోయి, ప్రజాసేవ చేస్తున్న కార్యదక్షుడైన మోదీ వంటి నేతలపై విమర్శలు చేసి ఓట్లు అడుగుతున్న తీరుకు ప్రజలు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. బాబు హయాంలో అభివృద్ధి ఎండమావిగా మారిందని మండిపడ్డారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పనులను చేసిన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో తిరిగి అధికార పీఠమెక్కడం ఖాయమని, రాష్ట్రంలో కూడా బీజేపీని గద్దెనెక్కిస్తే ఇక్కడ కూడా అవినీతి రహిత పాలన అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ ప్రజలకు విజ్ఞప్తిచేశారు  


మరింత సమాచారం తెలుసుకోండి: