నరసాపురం కిరీటం కోసం ఏకంగా ముగ్గురు రాజులు పోటీలో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు చాలదన్నట్లు నడుమ నరసాపురాన్ని కాపు కాసేది తానే అన్నట్లుగా నాగుబాబు. ఇక చెప్పేదేముంది ఇక్కడ పోటి గురించి. ముగ్గురు రాజులేమో ప్రజలతో తమకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుంటుండగా నాగాబాబేమో సెలబ్రిటీ స్టేటస్ లో పోటీ పడుతున్నారు. దానికి తోడు నరసాపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధుల బలాబలాలు కూడా తోడవ్వటంతో పోటీ రసవత్తరంగా మారుతోంది.


నరసాపురం లోక్ సభ పరిధిలోకి నరసాపురం, భీమవరం, ఆచంట, ఉండి, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా వైసిపి ఎంఎల్ఏలు లేరు. టిడిపి పార్లమెంటు అభ్యర్ధిగా శివరామరాజు, వైసిపి నుండి రఘరామకృష్ణంరాజు, జనసేన తరపున నాగుబాబు, కాంగ్రెస్ తరపున మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు, బిజెపి నుండి పైడికొండల మాణిక్యాలరావు పోటీలో ఉన్నారు. అంటే నరసాపురం కిరీటం కోసం ముగ్గురు రాజులు, ఇద్దరు కాపులు పోటీలో ఉన్నారన్నమాట.

 

ఇక్కడ కిరీటం కోసం ఐదుగురు పోటీలో ఉన్న ప్రధానంగా టిడిపి, వైసిపి, జనసేన మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందన్నది అంచనా. వీరిలో కూడా టిడిపి అభ్యర్ధి శివరామరాజు ప్రభావం పెద్దగా ఉండదనే ప్రచారం జరుగుతోంది. అంటే వైసిపి అభ్యర్ధి రఘురామరాజు, జనసేన నాగుబాబు మధ్య పోటీ ఉంటుందనే ప్రచారం జోరుగా ఉంది. అందుకే అభ్యర్దుల మధ్య పోటీ కాస్త నియోజకవర్గం వ్యాప్తంగా ఉండే రాజులు, కాపుల మధ్య పోరాటంగా మారిపోయింది.

 

పార్లమెంటు పరిధిలోని ఏ ఒక్క అసెంబ్లీలోను ఎంఎల్ఏలు లేకపోయినా గెలుపు అవకాశాలు మాత్రం వైసిపికే ఉందనే ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. అందుకు ప్రభుత్వంపై జనాల్లోని వ్యతిరేకతే ప్రధాన కారణం. దానికితోడు  వైసిపి అభ్యర్ధి ఆర్ధిక, అంగ బలం ముందు మిగిలిన అభ్యర్ధులెవరూ సోదిలోకి కూడా రాలేరు. కారణం ఏదైనా కానీ పోయిన ఎన్నికల్లో టిడిపికి అండగా నిలిచిన రాజులందరూ రాబోయే ఎన్నికల్లో వైసిపికి మద్దతివ్వాలని గట్టిగా నిర్ణయించుకోవటం కూడా వైసిపికి బాగా కలసివస్తోంది.

 

సరే ఐదేళ్ళల్లో టిడిపి ఎంఎల్ఏల మీదున్న అవినీతి ఆరోపణల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. దానికితోడు లోక్ సభతో పాటు అసెంబ్లీ అభ్యర్ధులను కూడా చివరి నిముషం వరకూ మారుస్తునే ఉన్నారు. జనసేన తరపున నాగుబాబును పోటీ చేయించాలనే నిర్ణయం కూడా అలా చివరి నిముషంలో చేసిందే. అందుకే చంద్రబాబు, పవన్ ఒకటే అన్న ప్రచారం జోరుగు జరుగుతోంది.

 

ఈ నియోజకవర్గంలో సుమారు 14.40 లక్షల ఓట్లున్నాయి. ఇందులో బిసిలు 6.60 లక్షలు, కాపులు 3.65 లక్షలు, ఎస్సీ, ఎస్టీలు 2.26 లక్షలు, క్షత్రియులు 72 వేల ఓట్లున్నాయి. బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, ముస్లింలు సుమారుగా లక్ష ఓట్లున్నాయి. అంటే అభ్యర్ధుల గెలుపోటముల్లో బిసిలదే  ప్రధాన పాత్ర. పోటీలో ముగ్గురు రాజులున్నప్పటికి మెజారిటీ రాజుల ఓట్లు వైసిపికే పడే అవకాశం ఉంది. అలాగే కాపు ఓట్లు కూడా నాగుబాబుకే ఎక్కువ పడతాయంటున్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, రెడ్డి, ముస్లిం ఓటర్లలో మొగ్గు వైసిపి వైపుండే అవకాశాలున్నాయి. కాబట్టి ఇక్కడ కిరీటం వైసిపి అభ్యర్ధికి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: