తూర్పు గోదావరి జిల్లా మండపేట టీడీపీకి కంచుకోట. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో...ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి వేగుళ్ళ జోగేశ్వరరావు సుమారు 13 వేల ఓట్ల పైనే మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మళ్ళీ జోగేశ్వరావు 3 6వేల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఇక ఇప్పుడు మూడోసారి టీడీపీ తరుపున బరిలోకి దిగిన వేగుళ్ల జోగేశ్వరావు హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. గత ఐదేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జోగేశ్వరరావు నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు సంపాదించుకున్నారు. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందున్నారు. నియోజకవర్గంలో అన్నివర్గాలతో సత్సంబధాలు కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక గ్రామాల్లో అభివృద్ధి మునుపెన్నడూ లేని విధంగా చేశారు. ఇప్పుడు ఇవే జోగేశ్వరరావుని విజయం వైపు నడిపిస్తున్నాయి. 


ఇక విప‌క్ష వైసీపీ స‌రైన అభ్య‌ర్థి నిల‌బెట్ట‌డంతో త‌ప్పుల మీద త‌ప్పులు చేసింది. అభ్యర్ధి విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోలేక కార్యకర్తలని కన్ఫ్యూజన్ చేసి చివరకి ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి సుబాష్ చంద్రబోష్‌ని రంగంలోకి దించింది. కానీ ముందు ముగ్గురు అభ్యర్ధులని మార్చింది. మొదట నియోజకవర్గ కో ఆర్డినేటర్లుగా వేగుళ్ల పట్టాభిరామయ్య, వేగుళ్ల లీలాకృష్ణలు పని చేశారు. తర్వాత వీరిని పక్కనబెట్టేసి కాకినాడ‌కు చెందిన డాక్ట‌ర్ పితాని అన్నవరంని అభ్యర్ధిగా ప్రచారం చేశారు. కానీ అన్నవరం కూడా చేతులెత్తేయడంతో నోటిఫికేష‌న్ వ‌చ్చాక చివ‌ర్లో ఎవ‌రిని పోటీలో పెట్టాలో తెలియ‌క పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ని పోటీకి దింపింది.


వాస్త‌వంగా చూస్తే పిల్లి బోస్ రామ‌చంద్రాపురం సీటు ఆశించారు. ఆయ‌న అభీష్టానికి వ్య‌తిరేకంగా గ‌త ఎన్నిక‌ల్లో కాకినాడ రూర‌ల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జ‌డ్పీ మాజీ చైర్మ‌న్ చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌ను రామచంద్రాపురంలో పోటీ చేయిస్తూ బోస్‌ను ఇక్క‌డ బ‌ల‌వంతంగా పోటీ పెట్టారు. అయితే సుభాష్‌కి ఈ నియోజకవర్గంపై పట్టు లేదు. దీంతో ఇక్కడ వైసీపీ కేడర్ సహకారం పూర్తిగా అందడం కష్టం. కాకపోతే వైసీపీ నవరత్నాలు, జగన్ ఇమేజ్ పార్టీని కొంతవరకు ఆదుకునే అవకాశం ఉంది. అయితే అవి ఎంతవరకు తీసుకురాగలవో చెప్పలేం. ఇక వైసీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వేగుళ్ళ లీలా కృష్ణ జనసేనలోకి వెళ్లి...ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. కాపు సామాజికవర్గం, పవన్ ఇమేజ్‌పైనే ఆశలు పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ టీడీపీ-వైసీపీకి ఉన్న కేడర్ జనసేనకి లేకపోవడం మైనస్ అయ్యేలా కనిపిస్తోంది.


ఈ నియోజకవర్గంలో మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు ఉన్నాయి. సామాజికవర్గాల పరంగా చూస్తే..ఇక్కడ సుమారు 95వేలు మంది బీసీ, 45 వేల మంది ఎస్సీ, 50వేల మంది ఓసీ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బీసీలలో శెట్టిబలిజ ఓటర్లు అధికంగా ఉన్నారు.  వీరే అభ్యర్ధుల గెలుపోటములని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే టీడీపీ, జనసేన అభ్యర్ధులు కమ్మ సామాజికవర్గం కాగా, వైసీపీ అభ్యర్ధి శెట్టిబలిజ వర్గం. కానీ ఇక్కడ శెట్టిబలిజలు టీడీపీ వైపు ఎక్కువ ఉంటారు. అటు కమ్మ ఓట్లు కూడా టీడీపీకే ఉంటాయి. కాపులు జనసేన, టీడీపీకి పడే అవకాశం ఉంది. ఎస్సీలు ఎక్కువ వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మొత్తం మీద ఇక్కడ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉన్న టీడీపీ స్వ‌ల్ప ఎడ్జ్ ఉంది. దీనికి ఓ కార‌ణం కూడా ఉంది. గ‌త  రెండు ఎన్నిక‌ల్లోనూ వేగుళ్ల నోట్ల క‌ట్ట‌లు తెంపి మ‌రీ భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఈ సారి కూడా ఆయ‌న అభివృద్ధి కంటే మ‌ళ్లీ నోట్ల క‌ట్ట‌లు తెంపి గెలిచేందుకు రెడీ అయిపోయార‌ట‌. మరి చూడాలి ఎన్నికల సమయంలో ప్రజలు...టీడీపీకి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెడతారో లేక వైసీపీ, జనసేనలలో ఒకరిని గెలిపించుకుంటారో. 


మరింత సమాచారం తెలుసుకోండి: