విప్‌. చింతమనేని ప్రభాకర్‌ పేరు చెప్పగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి కావాల్సినంత సరుకు ఆయన దగ్గరే ఉందని ప్రతీ ఒక్కరికి అర్థం అయిపోతుంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండేందుకే ఇష్టపడే ప్రభాకర్‌ ఒకప్పుడు మాగంటి ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న దెందులూరును పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుని 2009, 2014 ఎన్నికల్లో రెండు వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2014లో గెలిచిన తర్వాత ప్రభాకర్‌కు చంద్రబాబు తన కేబినెట్‌లో విప్‌ పదవిని కట్టపెట్టారు. ఒకానొక దశలో మంత్రి పదవి రాలేదని అలిగి సొంత పార్టీ పెడతానంటూ బహిరంగ వ్యాఖ్యలు సైతం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులను బెదిరించిన, నియోజకవర్గంలో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని క్రియేట్‌ చేసుకున్న, మహిళా అధికారిపై దాడి చేసినా, ఉద్యోగుల విషయంలో దురుసుగా ఉన్నా, సొంత పార్టీ కేడర్‌ను సైతం తిట్టినా పదేళ్లుగా ప్రభాకర్‌కు ఏదోలా కాలం గడిచిపోయింది. అయితే పదేళ్లలో ప్రభాకర్‌ తొలి సారి ఈ ఎన్నికల్లో తీవ్రమైన వ్యతిరేఖతను ఎదుర్కొంటున్నారు. 


ప్ర‌భాక‌ర్‌పై వ్య‌తిరేక‌త‌...
ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఏపీ హెరాల్డ్‌ టీం సభ్యులు పరిశీలించినప్పుడు ప్రభాకర్‌పై ఉన్న వ్యతిరేఖత తేటతెల్లం అవుతోంది. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలతో సరిపోల్చి చూసినప్పుడు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలతో పోల్చుకున్నా దెందులూరు నియోజకవర్గంలో కొంత వరకు అభివృద్ధి జరిగిందన్న మాట వాస్తవం. అంతర్గత రహదారులు, సీసీ రహదారులు, పుంత రోడ్లతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విషయంలో అధికారుల అలసత్వాన్ని ప్రభాకర్‌ ఏ మాత్రం సహించలేదు. అదే టైమ్‌లో అధికారులను పలు సందర్భాల్లో బెదిరించడం, ప్రభుత్వ పథకాలు కేవలం తన పార్టీ వారికే అందేలా చెయ్యడంలో ఆయన పక్షపాతం వహించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. రెండు ఎన్నికల్లోనూ ప్రభాకర్‌ వైపు పూర్తిగా ఉన్న ఆయన సొంత సామాజికవర్గం అయిన కమ్మ సామాజికవర్గం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. కమ్మ సామాజికవర్గంలో చాలా గ్రామాల్లో దాదాపు సగం మంది వరకు వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరికి మద్దతు ఇస్తున్నారు. 


దెందులూరు, పెదవేగి మండలంలో కమ్మ సామాజికవర్గం పట్టున్న మెజారిటీ గ్రామాల్లో ఈ వర్గం నుంచి వైసీపీలోకి పెద్ద ఎత్తున వలసలు కంటిన్యూ అవుతున్నాయి. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా సీనియర్లను సైతం మాట తూలే విషయంలో ప్రభాకర్‌ వ్యక్తిత్వాన్ని చాలా మంది అస‌హ్యయించుకునే పరిస్థితి వచ్చింది. దీంతో చాలా మందిని ఆయన దూరం చేసుకున్నారు. దెందులూరు నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా కమ్మ సామాజికవర్గానిదే ఆధిపత్యం. ప్రధాన పార్టీల తరపున ఈ సామాజికవర్గానికి చెందిన వారే పోటీ చేస్తు వస్తున్నారు. దీంతో గత ఎన్నికలకు ముందు జగన్‌ అప్పటి వరకు తణుకు ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావును ఇక్కడ పోటీ చేయించి రాంగ్‌ స్టెప్‌ వేశారు. ఇక్కడ ప్రభాకర్‌ను ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్న జగన్‌ ప్రభాకర్‌ సమీప బంధువు, ఆయన సామాజికవర్గానికే చెందిన యూరప్‌, యూకేలో వైసీపీని బలోపితం చేసిన కొఠారు అబ్బయ్య చౌదరిని ఏడాది క్రితమే రంగంలో దించారు. స్వతాహాగా అందరిని కలుపుకుపోయే మనస్థత్వం ఉన్న అబ్బయ్య చౌదరి ఏడాది కాలంగా నియోజకవర్గంలో విసృతంగా పర్యటించి ప్రజలకు దగ్గర అయ్యారు. అదే సమయంలో ప్రభాకర్‌ తీరుతో ఇటు సొంత సామాజికవర్గంతో పాటు కొల్లేరులో కీలకంగా ఉన్న వడ్డీలు, ఎస్సీ, ఎస్టీల్లో అబ్బయ్య చౌదరి వైపు మొగ్గు కనపడుతోంది.  


ఇటు పార్టీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడం కూడా అబ్బయ్య చౌదరికి ప్లస్‌ కానుంది. నియోజకవర్గంలో జగన్‌ చేపట్టిన పాదయాత్రతో పాటు తాజాగా షర్మిల రోడ్‌ షోలకు సైతం విశేష స్పందన లభిస్తోంది. అబ్బయ్య చౌదరి ఫ్యామిలీకి దెందులూరు నియోజకవర్గంలో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అబ్బయ్య చౌదరి తండ్రి కొఠారు రామచంద్రరావు 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇదే ప్రభాకర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. పాత పరిచయాలతో పాటు నియోజవకర్గంలో ప్రతీ ఒక్కరిని కలుపుకుపోవడం ఇటు పార్టీ వేవ్‌ అటు ప్రభాకర్‌పై ఉన్న వ్యతిరేఖత నేపథ్యంలో అబ్బయ్య చౌదరి చాలా మంది అంచనాలకు మించి ఊహించని విధంగా ప్రభాకర్‌తో ఢీ అంటే ఢీ అనేలా తలపడుతున్నారు. ఇక జనసేన నుంచి ఘంటశాల వెంకటలక్ష్మి పోటీలో ఉన్నారు. లంక గ్రామాల్లో బలంగా ఉన్న వడ్డీ సామాజికవర్గానికి చెందిన వెంకటలక్ష్మి విజయం సాధించే అవకాశాలు లేకపోయినా ఆమె బీసీల ఓటింగ్‌ను బలంగా చీల్చితే టీడీపీకి మైనెస్‌ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. 


ఇప్పటికే ఆ సామాజికవర్గంలో వ్యతిరేఖతతో ఉన్న కొందరు అబ్బయ్య చౌదరికి దగ్గర అవ్వగా మరికొందరు వెంకటలక్ష్మీకి ఓటు వెయ్యడం, కాపుల్లో మెజారిటీ వర్గాలు జనసేనకు మద్దతు ఇస్తే ఆ ఓటింగ్‌ అంతా ప్రభాకర్‌కు మైనెస్‌ కానుంది. ఇక దెందులూరులో ప్రభాకర్‌పై పోటీ చెయ్యడానికే గట్స్‌ ఉండాలి అనే ప్రచారం నుంచి ఇప్పుడు ఎన్నికలు మరో నాలుగైదు రోజుల్లో ఉన్న వేల గ్రౌండ్‌ రిపోర్ట్‌ చూస్తే అబ్బయ్య చౌదరి గెలుస్తాడని సైతం భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. పెదవేగి, దెందులూరు మండలాల్లో చాలా గ్రామాల్లో అబ్బయ్య చౌదరి గెలుపుపై కమ్మ సామాజికవర్గంతో పాటు రైతులు భారీగా బెట్టింగులు కాస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరులోనూ ఈ సారి ప్రభాకర్‌ ఓడిపోతారని, ప్రభాకర్‌కు మెజారిటీ రాదని, అబ్బయ్య చౌదరి 2000 మెజారిటీతో గెలుస్తాడని భారీగా పందాలు కాస్తున్నారు. ఏదేమైన అబ్బయ్య చౌదరి ఎన్నికల వేల సైతం సరిగ్గా పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసుకుంటే రేపటి ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలన ఫలితంతో ట్రెండ్‌ సెట్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి అబ్బయ్య ఇప్పటి వరకు చేసిన మేజిక్‌ రేపు ఎన్నికల ఫలితాల్లోనూ రిపీట్‌ చేస్తాడా ? లేదా చింతమనేని మూడో విజయంతో దెందులూరులో హ్యాట్రిక్‌ కొడతారా అనేది చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: