2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలోనే కాదు ఏపీలోనే ఉత్కంఠ రేపుతోన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకటిగా ఉన్న గన్నవరం నియోజకవర్గం రాజకీయం హాట్‌ హాట్‌గా నడుస్తోంది. కలకత్తా, చెన్నై జాతీయ రహదారికి ఇరువైపులా పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని హనుమాన్‌ జంక్షన్‌ నుంచి విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న రామవరప్పాడు రింగ్‌ రోడ్‌ వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలోనే విజయవాడ విమానాశ్రయం విస్తరించి ఉంది. ఇక్కడ నుంచి టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ ఉన్నారు. మరో సారి టీడీపీ సీటుపై ఆయనే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో దుట్టా రామచంద్రరావుపై 9000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన వంశీ ఈ సారి ఆర్థికంగా బలమైన ప్రవాస భారతీయుడు యార్లగడ్డ వెంకట్రావుపై పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వంశీ గెలుపు నల్లేరు మీద నడకగానే మారింది. దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి ఆప్తుడు, క్లాస్‌మెట్‌ అయిన కాపు వర్గానికి దుట్టా రామచంద్రరావుకు జగన్‌ సీటు ఇవ్వగా దుట్టాపై వంశీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో చాలా సానుకూల వాతావరణం ఉన్నా కూడా వంశీకి కేవలం 9000 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. 


ఐదేళ్ల పనితీరుతో చూస్తే వంశీపై ఇక్కడ మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు పాజిటీవ్‌గా స్పందిస్తే మరికొందరు ఆయన పని తీరుపై నెగిటీవ్‌గా ఉన్నారు. ఎయిర్‌పోర్ట్‌ భూములతో పాటు రాజధాని అభివృద్ధి కోసం తీసుకున్న భూములకు అధిక పరిహారం ఇప్పించడంలో సక్సెస్‌ అయిన వంశీ హనుమాన్‌ జంక్షన్‌ చక్కర ఫ్యాక్ట‌రీని తిరిగి తెరిపించడంలో విఫలం అయ్యారు. ఐదేళ్ల క్రిందట జరిగిన ఎన్నికలతో పోలిస్తే వంశీ ఈ సారి ఏటికి తీవ్రంగా ఎదురీదుతున్నారు. నియోజకవర్గంలో పట్టున్న మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్‌రావు, ఆయన సోదరుడు దాసరి జైరమేష్‌ వైసీపీలో చేరడంతో ఆ వర్గం మొత్తం వైసీపీకి బలంగా సపోర్ట్‌ చేస్తోంది. ఇటు ఈ సారి వంశీని ఎలాగైనా ఓడించాలని భావించిన జగన్‌ సామాజికపరంగానూ, ఆర్థికంగానూ వంశీకి సరితూగే యర్లగడ్డను రంగంలోకి దించారు. ఆయన ఏడాది కాలంగా నియోజకవర్గంలో తిరుగుతూ అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. 


ఇక్కడ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా పని చేసిన సుంక‌ర‌ పద్మశ్రీ పోటీ చేస్తున్నారు. జనసేన పొత్తులో భాగంగా సీపీఐకి సీటు కేటాయించింది. బాలవర్థన్‌రావు రాజకీయాలకు దూరంగా ఉన్నా నియోజకవర్గంలో ఆయనకు ఇప్పటికీ తన వర్గంపై మంచి పట్టు ఉంది. నియోజకవర్గంలో గన్నవరం, ఉంగుటూరు, బాపుల‌పాడు, విజయవాడ రూరల్‌ మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో అన్ని కులాల ప్రభావం ఉన్నా రెండు ప్రధాన పార్టీల నుంచి కమ్మ వర్గం వ్యక్తులే పోటీలో ఉండడంతో మిగిలిన సామాజికవర్గాలు గెలుపు ఓటమిలను ప్రభావితం చెయ్యనున్నాయి. బీసీల్లో గౌడ‌, యాదవ కుల ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారు ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది చూడాల్సి ఉంది. బీసీలు కాస్త టీడీపీ వైపు ఉన్నా వైసీపీకి ముస్లిం, ఎస్సీ ఓటర్ల మద్దతు బాగా ఉంది. యర్లగడ్డ కూడా కమ్మ సామాజికవర్గం వ్యక్తి కావడంతో ఆ సామాజికవర్గంలో చీలిక వచ్చిందని, ఆ వర్గంలో వంశీని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న వారంతా యర్లగడ్డ వైపు వెళ్లిపోతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. 


ఎన్నిక‌ల్లో అటు వంశీ, ఇటు యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ భారీగా డ‌బ్బులు వెద‌జ‌ల్లి ఓట్లు కొనేందుకు సిద్దంగా ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. రూ.100 కోట్ల‌కు త‌క్కువ కాకుండా ఓట్లు కొనుగోలు చేసేందుకు ఇద్ద‌రు అభ్య‌ర్థులు సిద్ధంగా ఉన్న‌ట్టు భోగ‌ట్టా. ఏదేమైనా వంశీని ఓడించేందుకు జగన్‌ అదే సామాజికవర్గానికి చెంది, ఆర్థికంగా బలంగా ఉన్న యర్లగడ్డ వెంకట్రావును రంగంలోకి దింపడంతో ఈ అస్త్రం కొంత వరకు సక్సెస్‌ అయినట్టే కనిపిస్తోంది. మరి ఈ అస్త్రం పూర్తి ఫలితం ఎలా ఉంటుందన్నది ఎన్నికల్లోనే చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: