రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఒంగోలు స్ధానం కూడా ఒకటి. శరవేగంగా మారిపోయిన రాజకీయ సమీకరణల్లో సహచరులే చివరకు ప్రత్యర్ధులుగా మారాల్సొచ్చింది. ఐదేళ్ళపాటు కలిసి పనిచేసిన మంత్రి శిద్ధా రాఘవరావు, ఎంఎల్సీ మాగుంట శ్రీనవాసులరెడ్డి చివరకు ప్రత్యర్ధులైపోయారు. లోక్ సభ టికెట్ ఖాయమైన తర్వాత మాగుంట టిడిపిని కాదని వైసిపిలో చేరి అభ్యర్ధిగా మారటంతో పోటీ రంజుగా ఉంది.

 

నిజానికి ఒంగోలు పార్లమెంటులో పోటీ చేయటానికి సరైన అభ్యర్ధి దొరకలేదు. మాగుంటకు టికెట్ చాలా కాలం క్రిందటే ఖాయమైనా ఊగిసలాడుతుండటంతో టిడిపిలో గందరగోళం నెలకొంది. చివరకు చంద్రబాబు ఒత్తిడితో పోటీకి రెడీ అయినా చివరినిముషంలో మాగుంట వైసిపిలో చేరిపోయారు. దాంతో పోటీ చేసే బాధ్యత శిద్దా మీదపడింది. శిద్దాను పోటీకి ఒప్పించటానికి చంద్రబాబు నానా అవస్ధలు పడాల్సొచ్చింది. దాంతోనే ఈ స్ధానంలో టిడిపి పరిస్దితేంటో అర్ధమైపోతోంది.

 

పార్లమెంటు పరిధిలోని మార్కాపురం, కనిగిరి, దర్శి, గిద్దలూరు, ఒంగోలు, కొండెపి, యర్రగొండపాలెం నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గెలిచిన వైసిపి ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించారు. అభ్యర్ధుల పరంగా చూస్తే ఆర్ధికంగా గట్టి స్దితిలోనే ఉన్నారు. కాకపోతే చాలామందిపై అవినీతి ఆరోపణలున్నాయి. అదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికలో చివరి నిముషం వరకూ అయోమయమే.  ఏడుగురు అభ్యర్ధుల్లో కనీసం ఐదుగురు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నవారే.

 

ఇక వైసిపి విషయానికి వస్తే మార్కాపురంలో కెపి నాగార్జునరెడ్డి, కనిగిరిలో బుర్రా మధుసూధనయాదవ్, దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్, గిద్దలూరులో అన్నా వెంకటరాంబాబు,  ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండెపిలో డాక్టర్ ఎం వెకయ్య, యర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ పోటీలో ఉన్నారు. ఐదేళ్ళల్లో ప్రజా సమస్యలపై పోరాడిన కారణంగా చాలామందిపై జనాలు సానుకూలంగా ఉన్నారు. కాకపోతే చాలామంది టిడిపి అభ్యర్ధుల్లాగ ఆర్ధికంగా స్ధితిమంతులు కాదు.

 

 ఒక ఓట్ల పరంగా చూస్తే సుమారు 15 లక్షల ఓట్లున్నాయి. బిసి ఓట్లు అత్యధికంగా 3.4 లక్షలుంటాయి. ఎస్సీలు 3.20 లక్షలు, రెడ్లు 2.25 లక్షలుంటారు. కమ్మ ఓట్లు 1.30 లక్షలు, కాపులు 1.20 లక్షలు, వైశ్యులు లక్షమందుంటారు. ముస్లింలు, ఎస్టీలు కలిపి సుమారు 1.6 లక్షలుంటారు. రెడ్లు మాగుంటకు, వైశ్యుల్లో ఎక్కువ శిద్దాకు మద్దతుగా నిలిచే అవకాశముంది. బిసిలు, కాపులు, ముస్లిం, ఎస్టీలు వైసిపికి మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.  అందులోను టిడిపి ఎంఎల్ఏ అభ్యర్ధులకు శిద్ధాకు పెద్ద సమన్వయం కూడా లేదనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఒంగోలులో మాగుంట గెలుపుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: