మల్కాజిగిరి...దేశంలో అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గం. పూర్తిగా నగర ప్రాంతంలోనే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండడం, పెద్ద లోక్‌సభ నియోజకవర్గం కావడం ఈ నియోజకవర్గం ప్రత్యేకత. దీనికి తోడుగా, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రండ్, టీఆర్ఎస్ పార్టీ నేతలకు పంటికింద రాయిలా మారిన రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి మర్రి రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి రాంచంద్రరావుపోటీలో ఉన్నారు.

 

2009లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం అవతరించింది. మొదటిసారి కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ గెలిచారు. 2014 ఎన్నికల్లో మల్లారెడ్డి విజయం సాధించారు. ఈ నెల 11న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలుపును ఎవరిని వరిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకుట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోనె్మంట్, ఉప్పల్, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, ఎల్‌బీ నగర్‌లో కాంగ్రెస్ గెలిచాయి. కుత్బుల్లాపూర్‌లో 5.60లక్షలు, మల్కాజిగిరిలో 4.30లక్షలు, కూకుట్‌పల్లిలో 3.92 లక్షలు, సికింద్రాబాద్ కంటోనె్మంట్‌లో 2.51లక్షలు, ఉప్పల్‌లో 4.68లక్షలు, ఎల్‌బీనగర్‌లో 5.16లక్షలు, మేడ్చల్‌లో 5.29లక్షల ఓటర్లున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారే ఎక్కువగా ఉంటారు.  

 

31 లక్షలకుపైగా ఓటర్లు ఉండడంతో గెలుపును అంచనా వేయడం కష్టమే. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఎంత మంది ఓటు వేస్తారో చెప్పలేం. నగర ప్రాంతం కావడంతో 50 నుంచి 55 శాతం పోలింగ్ అయితే గొప్ప. కొడంగల్ అసెంబ్లీలో ఓటమి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఏ విధంగానైనా ఇక్కడ గెలవాలని ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. రేవంత్ నియోజకవర్గానికి సుపరిచితుడే. అలాగే బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు కూడా ఎమ్మెల్సీగా అందరికీ తెలిసిన నేత. మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన అనుభవం, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ కలిసి వచ్చే అంశాలుగా పేర్కొనవచ్చు. నగరప్రాంతం కావడంతో ఓటర్లు రాజకీయంగా చర్చించేందుకు, తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఆసక్తిని ప్రదర్శించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ఇంకా పెద్ద ఎత్తున ఐటి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఉండడంతో ఓటింగ్ ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

 

అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర రెడ్డి మాజీ ఎంపీ, మేడ్చల్ ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి అల్లుడు. మల్కాజిగిరిలో పాగావేయాలని, రేవంత్ రెడ్డిని ఓడించాలని లక్ష్యంగా టీఆర్‌ఎస్ అన్ని వ్యూహాలతో ముందుకుపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయంగా తనను సవాలు చేసే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ఓటమికి అన్ని రకాల వ్యూహాలతో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గత మూడు నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరుపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తమ గెలుపునకు అనుకూలంగా మలుచుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.

 

మల్కాజిగిరి పార్లమెంటులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు అత్యంత ముఖ్యం. కాంగ్రెస్ నేతలందరికంటే తమపై దూకుడుగా స్పందిస్తున్న రేవంత్ ను ఓడించాలని గులాబీ ముఖ్యులు కంకణం కట్టుకున్నారు. మరోవైపు ఇప్పటికే కొడంగల్ లో ఓటమి పాలైన రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచితీరాలని చెమటోడుస్తున్నారు.  వెరసి తెలంగాణలోని అన్ని పార్లమెంటు నియోజకవర్గాల కంటే మల్కాజిగిరి ఎక్కో ఆసక్తిని రేకెత్తిస్తోందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: