గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈసారి పార్టీలు మారి వచ్చిన నలుగురు అభ్యర్ధుల మధ్య  విచిత్ర పోరు జరగనుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా...అదే కాంగ్రెస్ నుంచి 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన మేకతోటి సుచరిత...ఇప్పుడు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రావెల కిషోర్ బాబు...ప్రస్తుతం జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొరివి వినయ్‌కుమార్‌ 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఈ విధంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నలుగురు జంపింగ్ జపాంగ్‌ల మధ్య ఆసక్తికరమైన పోరు జరగనుంది.


టీడీపీ నుంచి పోటీ చేస్తున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయకుండా ఉన్నారు. ఇక తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్సీగా పని చేస్తున్నారు. అయితే సౌమ్యుడుగా, విద్యావంతుడుగా డొక్కాకి మంచి పేరుంది. డొక్కా రాజకీయ గురువు అయిన రాయపాటి సాంబశివరావుకి ప్రత్తిపాడులో అనుచరవర్గం బాగానే ఉంది. వీరు డొక్కాకి పూర్తి సహకారం అందించనున్నారు. అలాగే ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉంది. కానీ డొక్కా నియోజకవర్గానికి కొత్త కావడం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.


మరోవైపు జనసేన తరుపున రావెల కిషోర్ బాబు పోటీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు రావెలపై ఇక్కడి ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉంది. అయితే ఇక్కడ రావెలకి ఫాలోవర్స్ కూడా బాగానే ఉన్నారు. ఇక కాపుల ఓట్లు, పవన్ ఇమేజ్ రావెలకి ప్లస్ కానున్నాయి. అటు వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరితకి గత ఎన్నికలో ఓడిన సానుభూతి ఉంది. అలాగే గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం, వైసీపీ బలపడటం, కొంత ప్రభుత్వ వ్యతిరేకత లాంటి అంశాలు సుచరితకి ప్లస్ కానున్నాయి. అయితే సుచరిత ఓడిపోయాక నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేరనే విమర్శలు ఉన్నాయి. అలాగే టీడీపీ-జనసేన తరుపున బలమైన అభ్యర్ధులు బరిలో ఉండటం వలన సుచరిత గెలుపు అంత సులువు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పోటీ నామమాత్రమే కానుంది.


నియోజకవర్గంలో ఎస్సీలు,కమ్మ, కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడ ఎస్సీలు 60 వేల వరకు ఉండొచ్చు. కమ్మ 55 వేలు, కాపు 40 వేలు ఉన్నారు.  ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో...మూడు పార్టీల అభ్యర్ధులు వారే ఉన్నారు. దీంతో ఎస్సీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఇక కమ్మ ఓట్లు టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాపులు టీడీపీ-జనసేనలకి మద్ధతు ఇవ్వొచ్చు. ప్రస్తుత పరిణామాలని బట్టి చూస్తుంటే మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అయితే టీడీపీ-వైసీపీ అభ్యర్ధుల్లో ఒకరికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. మరి చూడాలి ఈ జంపింగ్ జపాంగ్‌లలో ప్రత్తిపాడుని ఎవరు దక్కించుకుంటారో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: