పోటీ ఉత్కంఠగా జరిగే కొద్ది నియోజకవర్గాల్లో రాజధాని జిల్లా గుంటూరులోని నరసరావుపేట కూడా ఒకటనటంలో సందేహం లేదు. ఇక్కడ అత్యంత సీనియర్లైన ఇద్దరు ప్రత్యర్ధులకు మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటున్న జూనియర్ సవాలు విసురుతున్నారు. టిడిపి అభ్యర్ధి రాయపాటి సాంబశివరావు గుంటూరు నుండి నాలుగుసార్లు, నరసరావుపేట నుండి ఒకసారి గెలిచారు. బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ ఐదుసార్లు ఎంఎల్ఏగా పోటీ చేశారు. ఎంపిగా మొదటిసారి పోటీ చేస్తున్నారు లేండి. మరి వైసిపి అభ్యర్ది మాటేమిటి ? ఏమిటంటే లావు శ్రీకృష్ణదేవరాయులు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

 

నిజానికి ప్రత్యర్ధుల  అనుభవం ముందు వైసిపి అభ్యర్ధి ఎందుకు పనికిరారు. అలాంటిది ప్రత్యర్ధులు ఇద్దరినీ లావు ఓ ఆటాడుకుంటున్నారు. కారణమేమిటంటే జనాల్లో వైసిపికున్న క్రేజే. దానికి రాయపాటిపై ఉన్న అవినీతి ఆరోపణలు. పోలవరం కాంట్రాక్టర్ గా రాయపాటిపై ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అదే పోలవరంపై చంద్రబాబునాయుడు మీద కూడా విపరీతమైన ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు చివరినిముషం వరకూ రాయపాటికి చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవటం కూడా టిడిపికి నష్టం చేసింది.

 

నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు ఎంఎల్ఏల్లో ఐదుగురి పైనా అవినీతి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి. నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్ధులే ఉన్నారు. వారిద్దరు కూడా ప్రజా వ్యతిరేక పోరాటాలతో జనాలకు బాగా దగ్గరయ్యారు. టిడిపిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే మళ్ళీ పోటీలో ఉన్నారు.

 

ఇక అందరి విషయం ఒక ఎత్తైతే సత్తెనపల్లిలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కుటుంబంపై ఉన్న ఆరోపణలు ఒకెత్తు. ఎంపి గెలవాలంటే కచ్చితంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే క్యాండిడేట్లపైనే ఆధారపడాలి. ఈ రకంగా చూస్తే ఎక్కువమంది టిడిపి అభ్యర్ధులకు మైనస్ మార్కులే వేయాలి. అదే సమయంలో వైసిపి అభ్యర్ధుల విషయంలో జనాల సానుకూలత కనబడుతోంది. దానికితోడు జనాల్లో ప్రభుత్వంపై పెరిగిపోయిన వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర లాంటిడి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. బిజెపి అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ గురించి చెప్పటానికి పెద్దగా ఏమీ లేదు.

 

ఇక సామాజికవర్గాలను చూస్తే సుమారు 16.7 లక్షల ఓట్లున్నాయి. ఇందులో అత్యధికంగా కమ్మ ఓటర్లు 2.7 లక్షలున్నాయి. ఈ ఓట్లను రాయపాటి, లావు చీల్చుకునే అవకాశాలున్నాయి. రెడ్లు 1.8 లక్షలు, ముస్లింలు 1. 75 లక్షలున్నారు. కాపుల్లోని 1. 60 లక్షల ఓట్లలో అత్యధికం కన్నాకు పోలయ్యే అవకాశాలున్నాయి. ఎస్సీలు 2.85 లక్షలున్నారు. వైశ్యులు, యాదవులు 1.7 లక్షలున్నారు. వడ్డెరలు, సుగాలీలు 1.25 లక్షలున్నారు. ఎస్సీలు, వైశ్య, ముస్లింలు, బిసిల ఓట్లు ఎవరికి ఎక్కువగా పడితే వారిదే గెలుపు. కాబట్టి కాగితాల మీద లెక్కలేసుకుని పలానా అభ్యర్ధే గెలుస్తారని చెప్పటం అంత సులభం కాదనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: