వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచి సీఎం పీఠం అధిరోహించిన వెంటనే ఆయన కేబినెట్‌ ఎలా ఉంటుంది ? ఎన్నికల్లో గెలిచిన ఎవరెవరికి కేబినెట్‌ బెర్త్‌లు దక్కుతాయి, సీనియర్లకు ఎలాంటి ప్ర‌యార్టీ ఉంటుంది అన్న దానిపై సహజంగానే ఆసక్తి ఉంటుంది. జగన్‌ ఇప్పటికే తన ప్రచారంలో ఇద్దరు మంత్రులకు చోటు ఉంటుందని ప్రకటించేశారు. చిలకలూరిపేటలో ఎన్నారై విడదల రజినీ కోసం బీసీ కోటాలో తన సీటు త్యాగం చేసిన సీనియర్‌ నేత మర్రి రాజశేఖర్‌కు కేబినెట్‌లో బెర్త్‌ ఉంటుందని... జగన్‌ తన తొలి కేబినెట్‌ బెర్త్‌పై సంచలన ప్రకటన చేశారు. ఇక మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం కేబినెట్‌ బెర్త్‌ ఇస్తున్నట్టు రెండో బెర్త్‌ను ప్రకటించేశారు. జగన్‌ ఇప్పటి వరకు ప్రకటించిన రెండు బెర్తల్లో ఒకటి కమ్మ సామాజికవర్గానికి... మరొకటి రెడ్డి సామాజికవర్గానికి ప్రకటించినట్లు అయ్యింది. 


ఇక జిల్లాల వారీగా కూడా సీనియర్లు వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం వచ్చేస్తుందని తమకు బెర్త్‌లు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన సీనియర్లతో పాటు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు, 2012 ఉప ఎన్నికల నుంచి గెలుస్తూ వస్తున్న వారు వివిధ సామాజిక సమీకరణల్లో ఆశల్లో ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి గతంలో మంత్రులుగా పని చేసిన ఇద్దరు సీనియర్లతో పాటు విశాఖపట్నం జిల్లాలో ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి జంప్‌ అయిన మరో సీనియర్‌ నేత జగన్‌ కేబినెట్‌ రేసులో ప్రధానంగా ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ కొట్టిన మరో ఎమ్మెల్యేతో పాటు కడప జిల్లాలో జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన ఎమ్మెల్యే పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కీలక సీటు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి, పార్టీ సీనియర్‌ నేతకు సైతం కేబినెట్‌ బెర్త్ ఖాయం. 


జగన్‌ కేబినెట్‌లో చోటు దక్కే మహిళా మణులు వీళ్లేనా..?
జగన్‌ తన కేబినెట్‌లో మహిళలకు సైతం తగిన ప్రాధాన్యత ఉండేలా ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ ఇద్దరు మహిళల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచ‌రిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వైఎస్‌ జగన్‌ కోసం 2012లో తన ఎమ్మెల్యే పదవిని వదులుకుని ఉప ఎన్నికల్లో గెలిచి గత ఎన్నికల్లో ఓడిన ఆమెకు మాదిగ సామాజికవర్గం కోటాలో బెర్త్‌ దక్కే ఛాన్సులు ఉన్నట్టు టాక్‌. సమీకరణలు ఏమైనా కలిసి వస్తే చిత్తూరు జిల్లా నగరి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండి...నగరి తాజా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్‌కే.

రోజా పేరు కూడా పరిశీలనకు రావొచ్చు. అయితే వైసీపీలో రెడ్డి సామాజికవర్గానికి ఏడెనిమిది బెర్త్‌లు గ్యారెంటీగా దక్కుతాయి. ఈ కోణంలో బలమైన వాయిస్‌ ఉన్న రోజాకు జగన్‌ బెర్తు ఇస్తారా ? లేదా... అనివార్య కారణాల వల్ల  ఆమెను పక్కన పెడతారా అన్నది అప్పుడే అంచనాకు రాని పరిస్థితి. ఇక ఎస్టీ కోటాలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ తాజా మాజీ ఎమ్మెల్యే విశ్వన‌రాయ కళావతి, విజయనగరం జిల్లాకు చెందిన కురుపాం తాజా మాజీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పోటీ పడుతున్నారు. వీరిలో పుష్ప శ్రీవాణి బలమైన వాయిస్‌ వినిపిస్తుండడంతో ఆమెకు ఎస్టీ మహిళా కోటాలో గ్యారెంటీగా కేబినెట్‌ బెర్త్‌ దక్కేందుకు ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: