ఏపీలో టీడీపీకి కంచుకోట అయిన గుంటూరు జిల్లాలో ఆ పార్టీ పునాదులు కదులుతున్నట్టే కనపడుతోంది. టీడీపీలో దశాబ్దాల చరిత్ర ఉన్న సీనియర్‌ నాయకులు సైతం ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి  సీనియర్‌ నేతగా ఉండడంతో పాటు పార్టీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారిన ఓ సీనియర్‌ నేత వచ్చే ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై విజయం సాధించలేక విలవిల్లాడే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇందుకు ఆయన స్వయంకృతాపరాధమే కారణం. గత ఎన్నికల్లో జిల్లాలోనే అతి తక్కువ మెజారిటీతో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచిన ఆ సీనియర్‌ ఐదేళ్లలో తీవ్రమైన వ్యతిరేఖత ఎదుర్కొన్నారు. ఆయన పుత్రరత్నంతో పాటు పుత్రికారత్నం చేసిన పనుల వల్ల ఆయనకు మూడున్నర దశాబ్దాల్లో లేని చెడ్డ పేరు గత ఐదేళ్లలోనే వచ్చిందన్నది మాత్రం  వాస్తవం. 


ఆ రెండు స్థానాలను కొంత వరకు అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే కేవలం పుత్రరత్నం చేసిన పనితో రెండున్నర దశాబ్దాలుగా ఆయనకు ఉన్న ఇమేజ్‌ మొత్తం ఖ‌ల్లాస్‌ అయ్యింది. పుత్రరత్నం తీరుతో చివరకు నియోజకవర్గంలో సాధారణ, మధ్య‌ తరగతతి ప్రజలు, వ్యాపారులే కాదు సొంత పార్టీ కేడర్‌ సైతం కక్కలేక మింగలేక అన్న చందంగా తమ బాధను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఐదేళ్ల పార్టీ సొంత పార్టీ కార్యకర్తలకే ఓ విధంగా చెప్పాలంటే నరకం చూపించిన ఆ పుత్రరత్నం తీరుతో చివరకు సొంత పార్టీ కేడర్‌ సైతం ఆ సీనియర్‌ సీటు ఇవ్వొద్దంటూ రోడ్డు ఎక్కిన పరిస్థితి. చివరకు ఏదోలా పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి, అష్టకష్టాలు పడి సీటు దక్కించుకున్న ఆ సీనియర్‌ నేతకు నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. ఇటు చూస్తే వైసీపీ నుంచి ఇప్పుడున్న అభ్యర్థికంటే మరో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే ఆ సీనియర్‌ నేత ఈ ఎన్నికలతోనే ఇంటికి వెళ్లిపోవడంతో పాటు తన రాజకీయ పరిసమాప్తి గ్రంధాన్ని తానే రాసుకున్న వాడు అయ్యేవాడు. 


అయితే వైసీపీ అధినేత సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆలోచించి సీటు ఇవ్వడంతో ఆ సీనియర్‌ నేతకు కాస్త పట్టు దొరికినట్లు అయ్యింది. అయినా పుత్రరత్నం, పుత్రికారత్నం ఐదేళ్లుగా చేసిన  ప‌నుల‌తో గెలిచే పరిస్థితి లేదు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎన్నికల ఖర్చుల కోసం డబ్బులు అడుగుతున్న సొంత పార్టీ కార్యకర్తలతో సైతం ఆ పుత్రరత్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఐదేళ్ల పాటు అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా చివరకు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ముక్కు పిండి మరీ వసూళ్లు చేస్తున్న ఆ పుత్రరత్నం ఇప్పుడు ఎన్నికల వేళ సొంత పార్టీ కేడర్‌ ఖర్చులకు సైతం డబ్బులు ఇవ్వాలంటే ఆగ్రహంతో కస్సుబస్సులాడుతున్నట్టు తెలిసింది. చివరకు ఎంపీగా పోటీ చేస్తున్న సీనియర్‌ నేతను సైతం డబ్బులు కావాలని డిమాండ్‌ చేసి  దేబరించుకునే  ప్రచారం గుంటూరు జిల్లాలో జోరుగా జరుగుతోంది.


గెలుపుపై నమ్మకం లేక జనసేన అభ్యర్థికి కొన్న‌ట్టు ప్ర‌చారం...
ఐదేళ్ల పాటు సొంత పార్టీ కార్యకర్తలనే ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించి ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో ఓట్లు వెయ్యమంటే వాళ్లు సైతం వేసే పరిస్థితి లేదు. అన్నింటా సానుకూల పరిస్థితులు లేకపోవడంతో చివరకు సదరు పుత్రికారత్నం జనసేన అభ్యర్థికి రూ. 5 కోట్లు ఇచ్చి తమకు అనుకూలంగా, వైసీపీ అనుకూల ఓటు చీల్చేలా అంతర్గత ఒప్పందానికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జనసేన నుంచి పోటీ చేస్తున్న ఆ సీనియర్‌ నేత సైతం రాజకీయంగా ఆ నియోజకవర్గంలో అనుభవం ఉన్న వ్యక్తే. గతంలో ఆయన కూడా అక్కడ ప్రాధినిత్యం వహించారు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అభ్యర్థి ఓట్లు చీల్చేలా అక్కడ ఆయన పేరును సదరు సీనియర్‌ నేతే ఖరారు చేయించేలా తెర వెనక చక్రం తిప్పారన్న ప్రచారమూ ఉంది. నియోజకవర్గంలో ప్రజాభిమానం పొందే విషయంలో చేతులు ఎత్తేసిన ఆ సీనియర్‌ నేత చివరకు జనసేనను అడ్డం పెట్టుకుని అయినా గెలుస్తారేమో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: