ఏపి ప్రజలు అతి తక్కువ కాలంలో మర్చిపోయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే అనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో ఎంత హఠాత్తుగా ముఖ్యమంత్రయ్యారో అంతే హఠాత్తుగా తెరమరుగైపోయారు. నిజానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రయ్యేంత సీన్ లేదన్న విషయం చాలామందికి తెలుసు. అదృష్టమో లేకపోతే తెరవెనుక చేసుకున్న ప్రయత్నాల సక్సెస్ ఫలితమో తెలీదు కానీ అమాంతం కిరణ్ సిఎం అయిపోయారు.

 

ప్రత్యేక తెలంగాణాను ఆపటం సాధ్యం కాదని తెలిసినా కొంత కాలం సిఎం హోదాలో డ్రామాలాడారు. ప్రత్యేక తెలంగాణాను అప్పటి యూపిఏ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటు సిఎం పదవికీ రాజీనామా చేసేశారు.  తరువాత జై సమైక్య పార్టీ పేరుతో ఓ పార్టీ పెట్టి పోటీ చేస్తే చివరకు డిపాజిట్లు కూడా దక్కలేదు లేండి.

 

అంతే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడా కనబడలేదు. దాదాపు ఐదేళ్ళపాటు రాజకీయంగా అజ్ఞాతంలో గడిపిన కిరణ్ మళ్ళీ ఎన్నికల వేడి మొదలైన తర్వాత ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ లో చేరారు. ప్రత్యేక తెలంగాణా ఇచ్చి ఏపిలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి కిరణే జవసత్వాలు నింపగలడని కాంగ్రెస్ అధిష్టానం ఎలా నమ్మిందో అర్ధం కావటం లేదు. నిజానికి అప్పట్లో తాను ప్రాతినిధ్యం వహించిన వాయల్పాడు నియోజకవర్గంలో తప్ప పక్క నియోజకవర్గం మీద కూడా ఎటువంటి ప్రభావం చూపలేని నేత.

 

అంటే కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన మహానేతలో అధిష్టానం ఏం చూసి ముఖ్యమంత్రిగా నియమించిందో ఇప్పటికీ చాలామందికి అర్ధంకాలేదు. ఆ విషయం బాగా తెలిసిన వారు కాబట్టి  నల్లారి వారి మంత్రివర్గంలోని సభ్యులు కూడా లెక్క చేయలేదు. అప్పట్లో మంత్రులుగా ఉన్న బొత్సా, ఆనం, డిఎల్ లాంటి వాళ్ళు కిరణ్ ను తాము సిఎంగా గుర్తించటం లేదని ఏకంగా మీడియా సమావేశంలోనే ప్రకటించారంటేనే తెలుస్తోంది కిరణ్ ఏ స్ధాయి నేతో.

 

సరే అయ్యిందేమో అయిపోయిందనుకుని అధిష్టానం, కిరణ్ మళ్ళీ కలిశారు. కొద్ది రోజులు రాష్ట్రంలో కాస్త హడావుడి చేశారు కానీ మళ్ళీ కనబడలేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి ఇప్పటి వరకూ అసలు అడ్రసే లేకుండా పోయారు. కీలకమైన ఎన్నికల సమయంలో కూడా కిరణ్ అడ్రస్ లేకుండా పోతే ఇంకెపుడు పార్టీని ఆదుకుంటారు ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే కిరణ్ రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: