ఒకప్పుడు తుని నియోజకవర్గం అంటే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కంచుకోట అని చెప్పేవారు. 1983 నుంచి 2004 వరకు జరిగిన అన్నీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యనమలే విజయం సాధిస్తూ వచ్చారు. కానీ తర్వాత నుంచి యనమల కోటకి బీటలు పడ్డాయి. 2009లో కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో తొలిసారి యనమల ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో యనమల పోటీ నుంచి తప్పుకుని...తన తమ్ముడు యనమల కృష్ణుడుని టీడీపీ నుంచి బరిలో దింపారు. కానీ వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా చేతిలో దాదాపు 18 వేల మెజారిటీ తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే ఈ సారి ఎన్నికల్లో మళ్ళీ ఈ ఇద్దరే టీడీపీ-వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా...జనసేన కూడా వీరికి పోటీగా 2009లో యనమలను ఓడించిన రాజా అశోక్‌బాబుని పోటీకి దించింది. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు జరగడం ఖాయమైంది.


అయితే ఈ ఐదేళ్లుగా టీడీపీ అధికారంలో ఉండటం...యనమల మంత్రిగా చేయడం వలన...నియోజకవర్గంలో అభివృద్ధి బాగానే జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు ప్రజాలకి చేరువయ్యాయి. కానీ యనమల కష్టపడుతున్న...తన కుటుంబంపై స్థానికంగా బాగా వ్యతిరేకత ఉంది. మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా ఉన్న కృష్ణుడుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అలాగే కృష్ణుడు కుమారుడుపైనా కూడా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువ జోక్యం చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. పైగా తునిలో దివి లేబరేటరీస్‌కి సంబంధించిన భూములు విషయంలో కూడా పెద్ద గొడవలే జరిగాయి. ఇవన్నీ యనమల కుటుంబానికి ఇబ్బందిగా మారే పరిస్తితి ఉంది. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వ్య‌క్తికి తిరిగి ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేలా చేసిన య‌న‌మ‌లపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. 


అటు వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా అధికారంలో లేకపోవడం వలన పెద్దగా పనులు చేయలేకపోయారు. అన్నిటిల్లో యనమల కుటుంబం కల్పించుకోవడం వలన రాజాకి ఇబ్బందిగా మారింది. అయితే ఎమ్మెల్యేగా ప్రజల్లో ఉండటం...పార్టీ కార్యక్రమాల ద్వారా కార్యకర్తలని కలుపుని వెళ్లారు. యనమల సోదరుల అవినీతి..ప్రభుత్వ వైఫల్యాలు రాజాకి ప్లస్. కానీ కాపు రిజర్వేషన్లపై జగన్ వైఖరి. జనసేన పోటీలో ఉండటం మైనస్. జనసేన నుంచి రాజా అశోక్ బాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న కాపు ఓటర్లు మీదే జనసేన ఆధారపడి ఉంది. అయితే ఓట్ల చీలికతో వైసీపీ అభ్యర్ధి రాజాకి నష్టం వచ్చేలా ఉంది.


ఈ నియోజకవర్గంలో యాదవులు, కాపులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత వెలమ, ఎస్సీలు, బీసీ ఇతర కులాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కొంత వైకాపాకి అనుకూలత ఉన్న...జనసేన తెరపైకి రావడంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సారి కూడా గెలవకపోతే తునిపై యనమల కుటుంబం పట్టు కోల్పోడం ఖాయంగా కనిపిస్తోంది.  ఇక్క‌డ టీడీపీ నుంచి య‌న‌మ‌ల సోద‌రుడు కృష్ణుడు పోటీ చేస్తున్నా ఇక్క‌డ పార్టీ ఓడిపోతే య‌న‌మ‌ల ఓడిన‌ట్టే అన్న చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు ఓడిన య‌న‌మ‌ల ఫ్యామిలీ రేప‌టి ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ముచ్చ‌ట‌గా మూడో సారి ఓడ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌స్తుత గ్రౌండ్ రిపోర్ట్ చెపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: