ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం పార్లమెంటు సీటులో పోటీ టిడిపి, వైసిపి మధ్య నువ్వా నేనా అన్నట్లుంది.  ఇక్కడ నుండి పోటీ చేస్తున్న నలుగురు అభ్యర్ధుల్లో ముగ్గురు మొదటిసారి పోటీ చేస్తుండటం గమనార్హం. ఒక్క బిజెపి తరపున పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రమే సీనియర్ నేత. టిడిపి తరపున పోటీ చేస్తున్న శ్రీ భరత్, వైసిపి  అభ్యర్ధి ఎంవివి సత్యనారాయణ, జనేసేన నుండి పోటీ చేస్తున్న జెడి లక్ష్మీనారాయణ మొదటిసారిగా పోటీ చేస్తున్నారు.

 

పోటీలో నలుగురు అభ్యర్దులున్నప్పటికీ అందరి చూపులు  ప్రధానంగా టిడిపి అభ్యర్ధి భరత్, వైసిపి సత్యనారాయణ మీదే ఉంది. ఎంపి అభ్యర్ధుల గెలుపు ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్ధుల మీదే ఆధారపడుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ విషయానికి వస్తే వైసిపికన్నా టిడిపి అభ్యర్ధులు కాస్త మెరుగైన స్ధితిలో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత, తమపై ఉన్న అవినీతి ఆరోపణలు టిడిపి ఎంఎల్ఏలకు పెద్ద మైనస్ గా మారుతోంది. అంటే టిడిపి మైనస్సే వైసిపి ప్లస్ అన్నమాట.

 

టిడిపి తరపున విశాఖ తూర్పులో సిట్టింగ్ ఎంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ, పశ్చిమంలో పిజివిఆర్ నాయుడు, ధక్షిణంలో వాసుపల్లి గణేష్, ఉత్తరంలో మంత్రి గంటా శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఉత్తరంలో బిజెపి సిట్టింగ్ ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు కూడా పోటీలో ఉన్నారు. గాజువాకలో పల్లా శ్రీనివాస్, భీమిలీలో సబ్బం హరి, ఎస్ కోటలో కోళ్ళ లలితకుమారి పోటీలో ఉన్నారు.

 

 వైసిపి నుండి తూర్పులో అకరమాని విజయనిర్మల, పశ్చిమంలో మళ్ళ విజయప్రసాద్, ధక్షిణంలో ద్రోణంరాజు శ్రీనివాస్,  ఉత్తరంలో కెకె రాజు, గాజువాకలో నాగిరెడ్డి, భీమిలీలో అవంతి శ్రీనివాస్, ఎస్ కోటలో కె శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. వైసిపి అభ్యర్ధులు కూడా నియోజకవర్గాల్లో గట్టి పట్టున్నవారే. కాకపోతే కొందరు ఆర్ధికంగా టిడిపి అభ్యర్ధులంతా బలమైన వారు కాకపోవచ్చు. భరత్ అయినా, ఎంవివి అయినా ఎంఎల్ఏ అభ్యర్ధులపై ఆధారపడాల్సిన వారే.

 

ఈ నియోజకవర్గంలో సుమారుగా  22 లక్షల ఓట్లున్నాయి.  కాపులు 3.5 లక్షలు, బిసిలు 4 లక్షలు, ఉత్తరాధి వాళ్ళ ఓట్లు 4 లక్షలు,  2 లక్షల బ్రాహ్మణులు, కొప్పుల వెలమలు 2 లక్షలు, కమ్మోరు 30 వేలు, రెడ్లు 50 వేలుండగా మిగిలిన ముస్లింలు తదితర సామాజిక వర్గాలు కూడా ఉన్నాయి. ఉత్తరాధి ఓట్లలో మెజారిటీ బిజెపి అభ్యర్ధి పురంధేశ్వరికి పడే అవకాశాలున్నాయి. కాపు ఓట్లు జనసేన అభ్యర్ధికి పడినా, కమ్మ ఓట్లలో మెజారిటీ టిడిపికి పడే అవకాశాలున్నాయి. ముస్లింలు, బిసిలు, బ్రాహ్మణులు, రెడ్లు,  క్షత్రియులతో పాటు ఇతరుల ఓట్లు కీలకం. మొత్తానికి ఎవరు గెలిచినా పెద్దగా మెజారిటీ అయితే వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. అందుకే టిడిపి, వైసిపి మధ్యే బిగ్ ఫైట్

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: