నిజానికి రాజంపేట పార్లమెంటు సీటులో పోటీ చేయటానికి తెలుగుదేశంపార్టీకి అభ్యర్ధే దొరకలేదు. పోటీ చేయమని చంద్రబాబునాయుడు ఏ నేతను అడిగినా ఎవరూ ముందుకురాలేదు. వేరేదారి లేక చివరకు చిత్తూరు సిట్టింగ్ ఎంఎల్ఏ సత్యప్రభనే చంద్రబాబు బలవంతంగా పోటీకి ఒప్పించారు. ఇష్టంలేని పోటీ కదా ప్రచారం కూడా అలాగే ఉంది. అందుకే ఈ సీటులో గెలుపు విషయంలో టిడిపిలోనే ఎవరికీ పెద్దగా ఆశలు లేవు.

 

ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్న పార్టీకి లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేయటానికి గట్టి అభ్యర్ధే దొరకలేదంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధం చేసుకోవచ్చు. గట్టి అభ్యర్ధి ఎందుకు దొరకలేదంటే వైసిపి తరపున పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పోటీ చేస్తుండటమే. మిధున్ రెడ్డి గురించి కొత్తగా ఎవరికీ పరిచయం అవసరం లేదు.   మాజీ మంత్రి, ఐదుసార్లు ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, మాజీ ఎంపినే మిధున్.

 

పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కనీసం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దిరెడ్డి కుటుంబానికి బాగా పట్టుంది. దానికితోడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, టిడిపి సిట్టింగ్ ఎంఎల్ఏలపై అవినీతి ఆరోపణలు తదితరాల వల్ల మిధున్ కు వ్యతిరేకంగా పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం టిడిపి నేతల్లో ఎవరిలోను లేదు. అందుకనే చంద్రబాబు అడిగినా నేతలు ఎవరూ పోటీకి ఇష్టపడలేదు. సరే సత్యప్రభకు పోటీ చేయక తప్పలేదు లేండి.

 

రాజంపేట పార్లమెంటు పరిధిలో చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాలున్నాయి. అలాగే కడప జిల్లాలో రాజంపేట, కోడూరు, రాయచోటి అసెంబ్లీలున్నాయి. వీటిల్లో పుంగనూరులో స్వయంగా రామచంద్రారెడ్డే పోటీ చేస్తున్నారు. అలాగే తంబళ్ళపల్లిలో రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాధరెడ్డి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాల్లో మిధున్ కు బాగా మెజారిటీ వచ్చే అవకాశముంది.

 

అలాగే పీలేరులో రామచంద్రారెడ్డి మద్దతుదారులు సిట్టింగ్ ఎంఎల్ఏ చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ మెజారిటీకి ఢోకా ఉండదు. మిగిలిన మదనపల్లి, రాయచోటి, రాజంపేట, కోడూరులో కూడా వైసిపి తరపున బలమైన అభ్యర్ధులే ఉన్నారు.  మొత్తం మీద టిడిపితో పోల్చుకుంటే వైసిపి అభ్యర్ధులే బలమైన అభ్యర్ధులుగా కనిపిస్తున్నారు. కాబట్టే టిడిపి అభ్యర్ధి సత్యప్రభ కూడా గెలుపుపై నమ్మకాలు పెట్టుకోలేదు. జనసేన తరపున సయ్యద్ ముకరం చాంద్, కాంగ్రెస్ తరపున షాజహాన్ భాష, బిజెపి తరపున పి. మహేశ్వరరెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రెడ్లు, బలిజలు, ఎస్సీలు, బిసిల ఓట్లున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: